కౌలు రైతు నానాజీది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: నారా లోకేశ్

  • బిల్లులు చెల్లించాలంటున్న చెరకు రైతులను పోలీసులు చావగొట్టారు
  • రైతులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు
  • పోలీసుల క్రూరత్వంతో రైతు నానాజీ మృతి చెందాడు
చెరకు రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. చెర‌కు బిల్లులు చెల్లించాల‌ని విజయనగరం జిల్లా సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట ఎన్‌సీఎస్ ఫ్యాక్ట‌రీ ఎదుట రాస్తారోకోకి దిగిన చెరకు రైతుల్ని చావ‌గొట్టిన పోలీసులు... వైసీపీ స‌ర్కారు పెద్ద‌ల ఆదేశాల‌తో తిరిగి బాధిత రైతుల‌పైనే అక్ర‌మ‌ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు విశాఖ జిల్లా పాయకరావుపేటలోని తాండవ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఆందోళన చేస్తున్న కౌలు రైతుని జ‌గ‌న్‌ స‌ర్కారు మూర్ఖ‌త్వ‌మే బలితీసుకుందని అన్నారు.

రూ. 10.65 కోట్ల బకాయిలు చెల్లించాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసుల క్రూర‌త్వంతో కౌలు రైతు నానాజీ మృతి చెందారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని లోకేశ్ అన్నారు. కౌలు రైతు నానాజీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరకు రైతుల బిల్లులు త‌క్ష‌ణ‌మే చెల్లించి, రైతుల స‌మ‌స్య‌ల‌ పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.


More Telugu News