అన్ని ఫార్మాట్లలో క్రికెట్ కు గుడ్ బై చెప్పేసిన హర్భజన్ సింగ్

  • క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన హర్భజన్
  • సోషల్ మీడియా ద్వారా వెల్లడి
  • అందరికీ కృతజ్ఞతలు తెలిపిన భజ్జీ
  • బౌలింగ్, బ్యాటింగ్ లో తనదైన ముద్రవేసిన పంజాబ్ యోధుడు
భారత క్రికెట్ యోధుడు హర్భజన్ సింగ్ అన్ని ఫార్మాట్లలో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మధురమైన అన్ని అంశాలకు ఇది ముగింపు... జీవితంలో అన్నీ ఇచ్చిన ఆటకు నేటితో వీడ్కోలు పలుకుతున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఈ 23 ఏళ్ల ప్రస్థానాన్ని ఆనందమయం, చిరస్మరణీయం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు.

1998లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన హర్భజన్ సింగ్ ఆఫ్ స్పిన్నర్ గా భారత జట్టుకు విశేష సేవలు అందించాడు. 2000 దశకంలో టీమిండియా సాధించిన అనేక విజయాల్లో భజ్జీ కీలకభూమిక పోషించాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. ఈ పంజాబీ వీరుడు బౌలింగ్ లోనే కాకుండా, బ్యాటింగ్ లోనూ ధాటిగా ఆడుతూ అభిమానులను అలరించాడు.

కెరీర్ లో 103 టెస్టులు ఆడిన హర్భజన్ 417 వికెట్లు సాధించాడు. బ్యాటింగ్ లో 2,224 పరుగులు చేశాడు. వాటిలో 2 సెంచరీలు, 9 అర్ధసెంచరీలు ఉన్నాయి. 236 వన్డేల్లో 269 వికెట్లు తీసి, 1,237 పరుగులు నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20 పోటీల్లో 28 మ్యాచ్ లలో 25 వికెట్లు పడగొట్టాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియాలో హర్భజన్ కూడా ఉన్నాడు. ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

కాగా, ఆట నుంచి తప్పుకున్న హర్భజన్ క్రికెట్ కామెంటరీ వైపు అడుగులు వేసే అవకాశాలున్నాయి. భజ్జీ మంచి మాటకారి కావడమే అందుకు కారణం.


More Telugu News