పెళ్లి ఆశచూపి వంచిస్తున్న వైనం.. రేప్ కేసుల్లో ఇవే ఎక్కువ!

  • పెళ్లికే బాధితుల మొగ్గు
  • లేదంటే పరిహారానికి డిమాండ్
  • నిజమైన అత్యాచార కేసులు తక్కువ
  • మైనర్లపై లైంగిక దాడి కేసులూ ఎక్కువే
పెళ్లి చేసుకుంటానని ఆశ చూపించడం, లైంగిక వాంఛలు తీర్చుకున్న తర్వాత మొహం చాటేయడం.. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అత్యాచారం కేసుల్లో ఎక్కువగా ఇవే ఉంటున్నట్టు పోలీసులు చెబుతున్నారు. మైనర్లపై లైంగిక దాడి కేసులు కూడా ఎక్కువే. మెజారిటీ కేసుల్లో ఈ రెండు రకాలవే ఉంటున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు.
 
ఎక్కువ శాతం అత్యాచారం కేసుల్లో మోసం చేయడం ప్రధానంగా కనిపించడం ఆందోళన కలిగించేదిగా సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. 2021లో ఇప్పటి వరకు 328 అత్యాచారం కేసులు నమోదు చేసినట్టు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
 
‘‘ఇందులో మూడు మినహా.. మిగిలినవన్నీ కేవలం సాంకేతికంగా రేప్ కేసులు. శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత తమ ఉద్దేశ్యాలను సాధించుకునేందుకు పెడుతున్న కేసులే ఎక్కువగా ఉన్నాయి. తమ భాగస్వామితో పెళ్లి చేసుకోవడమే వారి మొదటి ప్రాధాన్యం. లేదంటే కొన్ని కేసుల్లో పరిహారం కోరుకుంటున్నారు. నిజమైన అత్యాచార కేసులు మినహా మిగిలిన వాటిల్లో శిక్షలను కోరుకోవడం లేదు. చాలా కేసుల్లో ఫిర్యాదు దాఖలు చేయడానికి సైతం జాప్యం చేస్తున్నారు’’ అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి 2021 జూన్ లో కోర్టు పదేళ్ల కారాగార శిక్ష విధించిన కేసు ఒకటి నమోదైంది. చాలా కేసుల్లో ఫిర్యాదులతో ముందుకు వస్తున్న వారు తమ భాగస్వాములు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నట్టు పోలీసులు, సామాజిక నిపుణులు చెబుతున్నారు. పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు.


More Telugu News