కేసీఆర్ ను బద్నాం చేసేందుకు కుట్రలకు పాల్పడుతున్నారు: శ్రీనివాస్‌ గౌడ్‌

  • తెలంగాణ నాయకులను కేంద్రం బిచ్చగాళ్లుగా చూస్తోంది
  • కేసీఆర్ మీద కోపంతో రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతోంది
  • బీజేపీని ఎదుర్కోవడానికి మాకు వ్యూహాలున్నాయి
ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారికి ఇంత వరకు ఢిల్లీలో అపాయింట్ మెంట్లు దొరకలేదు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రులను అవమానించి ఢిల్లీ నుంచి పంపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. జాతీయ పార్టీల నేతలు పైరవీల కోసం ఢిల్లీకి వెళ్తారని... తాము మాత్రం తెలంగాణ ప్రయోజనాల కోసమే వెళ్తామని చెప్పారు.

అడుక్కోవడానికి తాము బిచ్చగాళ్లం కాదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ నాయకులను కేంద్రంలోని బీజేపీ బిచ్చగాళ్లుగా చూస్తోందని మండిపడ్డారు. మంచి చేస్తే కేంద్రం మంచి చేసిందని దేశమంతా తిరిగి చెపుతామని... చెడు చేస్తే దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తామని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కోపంతో, అధికారదాహంతో తెలంగాణను బీజేపీ ఇబ్బంది పెడుతోందని అన్నారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాకూడదనేదే బీజేపీ లక్ష్యమని విమర్శించారు. కేసీఆర్ ను బద్నాం చేయాలని కుట్రలకు పాల్పడుతున్నారని, వారి కుట్రలను తాము ఛేదిస్తామని అన్నారు. బీజేపీని ఎదుర్కోవడానికి తమ వ్యూహాలు తమకు ఉన్నాయని చెప్పారు.


More Telugu News