ఇటువంటి ఏ హీరోకీ సినిమా టికెట్ ధర గురించి మాట్లాడే అర్హత లేదు: అంబ‌టి

  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై వివాదం
  • ఏపీ స‌ర్కారుపై సినీ హీరో నాని సంచలన వ్యాఖ్యలు
  • హీరోలు పారితోషకాన్ని వెల్లడించాలంటూ అంబ‌టి డిమాండ్ ‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌పై వివాదం నెల‌కొన్న వేళ రాష్ట్ర స‌ర్కారుపై సినీ హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని, సినిమా హాళ్ల‌ కంటే కిరాణా దుకాణాల‌ కలెక్షన్‌ ఎక్కువగా ఉంటుంద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. అయితే, సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు త‌గ్గించి ప్రేక్ష‌కుల ప‌ట్ల సానుకూల నిర్ణ‌యం తీసుకున్నారంటూ ట్విట్ట‌ర్ లో చాలా మంది నెటిజ‌న్లు ఏపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా ట్వీట్లు చేస్తున్నారు.

మరోపక్క, హీరో నానిపై వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. హీరో నాని సినిమాల‌కు తీసుకుంటోన్న పారితోషికం ఎంత‌? అంటూ నిల‌దీస్తున్నారు. వైసీపీ నేత అంబ‌టి రాంబాబు కూడా ఈ విష‌యంపై స్పందిస్తూ నానిపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. 'పారితోషకాన్ని వెల్లడించకుండా సినిమా టికెట్ ధర గురించి మాట్లాడే నైతిక అర్హత ఏ హీరోకీ లేదు!' అంటూ అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు. మ‌రోవైపు, నాని న‌టించిన 'శ్యామ్ సింగ‌రాయ్' సినిమా ఈ రోజే విడుద‌లైంది.


More Telugu News