బ్యాటింగ్ కోచ్ గా వెస్టిండీస్ లెజెండ్ ను నియమించిన సన్ రైజర్స్ హైదరాబాద్

  • గత ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ పేలవ ప్రదర్శన
  • అత్యధిక ఓటములతో డీలాపడిన జట్టు
  • బ్యాటింగ్ కోచ్ గా బ్రియాన్ లారా
  • బౌలింగ్ కోచ్ గా డేల్ స్టెయిన్
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంతో నిలకడగా రాణించే జట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే గత సీజన్ లో ఆ జట్టు అత్యంత పేలవ ఆటతీరుతో విమర్శకులకు పని కల్పించింది. టోర్నీ మధ్యలో కెప్టెన్సీ మార్పు, ఆటగాళ్ల వైఫల్యం ఈ జట్టును పాయింట్ల పట్టికలో దిగువన నిలిపాయి. దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం రాబోయే సీజన్ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

బ్యాటింగ్ కోచ్ గా వెస్టిండీస్ బ్యాటింగ్ లెజెండ్ బ్రియాన్ లారాను నియమించింది. అసిస్టెంట్ కోచ్ గా ఆసీస్ మాజీ ఆటగాడు, బెంగళూరు మాజీ చీఫ్ కోచ్ సైమన్ కటిచ్ ను తీసుకువచ్చింది. అటు, బౌలింగ్ కోచ్ గా సఫారీ దిగ్గజం డేల్ స్టెయిన్ ను నియమించింది. కాగా, హెడ్ కోచ్ గా టామ్ మూడీ, స్పిన్ బౌలింగ్ కోచ్ గా, వ్యూహ బృందంలో సభ్యుడిగా ముత్తయ్య మురళీధరన్ ను కొనసాగించాలని నిర్ణయించారు. ఫీల్డింగ్ కోచ్ గా టీమిండియా మాజీ ఆటగాడు హేమాంగ్ బదానీ వ్యవహరిస్తాడు.

మొత్తమ్మీద టీమ్ మేనేజ్ మెంట్ ను ఫ్రాంచైజీ వర్గాలు పాక్షికంగా ప్రక్షాళన చేసినట్టే భావించాలి. ఇక జట్టులోనూ తీవ్రస్థాయిలో మార్పులు చేసేందుకు ఎస్ఆర్ హెచ్ సన్నద్ధమవుతోంది. త్వరలోనే ఆటగాళ్ల వేలం ఉండడంతో సరైన ఆటగాళ్లను తీసుకునేందుకు కసరత్తులు చేస్తోంది.


More Telugu News