ప్రముఖులకు రక్షణగా ప్రత్యేక మహిళా కమాండోలు

  • 32 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చిన సీఆర్పీఎఫ్
  • జనవరి నుంచి వీఐపీ రక్షణ బృందంలో చేరిక
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సోనియా, ప్రియాంక, రాహుల్ కు రక్షణ
దేశంలో అత్యంత ప్రముఖులైన వారి రక్షణ కోసం సుశిక్షితులైన మహిళా కమాండోలు రంగంలోకి దిగనున్నారు. ఇందుకోసం సీఆర్పీఎఫ్ 32 మంది మహిళా సిబ్బందిని సిద్ధం చేసింది. వీఐపీల రక్షణలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.

ఆయుధాల్లేకుండా పోరాడడం, బాడీ మొత్తాన్ని శోధించడం, కాంతి వేగంతో ఆయుధాల వినియోగం.. ఇలా వీఐపీ రక్షణకు సంబంధించి అన్ని రకాల అంశాల్లోనూ వారు తర్ఫీదు పొందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆయుధాలు సహా రక్షణకు అవసరమైన అన్ని సాధనాలు వీరి వెంట ఉంటాయని పేర్కొన్నాయి.

జనవరి నుంచి ప్రముఖుల రక్షణ బృందంలోకి ఈ మహిళా కమాండోలు చేరనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు మరో డజను వరకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న ప్రముఖులకు వీరు రక్షణ కల్పించనున్నారు. వీరి నివాసాల వద్ద, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లోనూ వీరి వెంటే ఈ కమాండోలు రక్షణగా నిలవనున్నారు.


More Telugu News