ఆటగాళ్లకు కరోనా సోకినా సిరీస్ మాత్రం ఆగదు... బీసీసీఐ, దక్షిణాఫ్రికా బోర్డు పరస్పర అంగీకారం

  • ఈ నెల 26 నుంచి భారత, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్
  • దక్షిణాఫ్రికాలో కరోనా ఉద్ధృతి
  • సిరీస్ కోసం తాజా మార్గదర్శకాలు
  • కరోనా సోకిన వారికి ఐసోలేషన్
  • వారిని కలిసిన వారికి ఐసోలేషన్ ఉండదన్న సఫారీ బోర్డు
ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతున్న నేపథ్యంలోనూ మూడు టెస్టుల సిరీస్ ను జరిపేందుకే బీసీసీఐ, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయించాయి. దక్షిణాఫ్రికాతో టీమిండియా టెస్టు సిరీస్ ఈ నెల 26న ఆరంభం కానుంది. తాజాగా ఆ దేశ క్రికెట్ బోర్డు వైద్యాధికారి షాయిబ్ మంజ్రా పరిస్థితిని సమీక్షించారు. మంజ్రా సమర్పించిన నివేదికపై బీసీసీఐ, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు పరస్పర అంగీకారానికి వచ్చాయి.

ఇరు జట్ల ఆటగాళ్లలోనూ, సహాయక సిబ్బందిలోనూ ఎవరికైనా కరోనా సోకితే వాళ్లను ఐసోలేషన్ లో ఉంచాలని తీర్మానించాయి. వారిని కలిసిన వాళ్లను ఐసోలేషన్ లో ఉండాలని బలవంతం చేయరాదని నిర్ణయించాయి. సిరీస్ ను ఆపేది లేదని స్పష్టం చేశాయి.

"భారత్ తో తాజా ఒప్పందంపై చర్చించాం. బయోబబుల్ లో ఉన్న అందరికీ వ్యాక్సిన్లు తప్పనిసరి చేశాం. ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే హోటల్ రూంలోనే ఐసోలేషన్ లో ఉంచుతాం. వారిలో కనిపించే లక్షణాలను బట్టి నిర్ణయం ఉంటుంది. వారిని కలిసిన వారికి నిత్యం కరోనా టెస్టులు చేస్తూనే ఉంటాం. వారు నిరభ్యంతరంగా ఆడొచ్చు" అని షాయిబ్ మంజ్రా వివరించారు. తాజా మార్గదర్శకాలపై బీసీసీఐతో చర్చించామని, ఆమోదం తెలిపిందని వెల్లడించారు.


More Telugu News