ఒమిక్రాన్ వైరస్ ప్రతి ఇంటికి చేరుతుంది.. నా హాలిడే ప్లాన్లన్నీ రద్దు చేసుకున్నా: బిల్ గేట్స్ ఆందోళన

  • నా సన్నిహితులు చాలా మంది వైరస్ బారిన పడుతున్నారు
  • మనమంతా చెత్త దశను చూడవచ్చు
  • అన్ని వైరస్ ల కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలన్నింటికీ వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. దీని దెబ్బకు ఇప్పటికే పలు దేశాలు ఆంక్షల దిశగా అడుగులు వేశాయి. లాక్ డౌన్లు సైతం విధించాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ స్పందిస్తూ... ఒమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని... ఇది ప్రతి ఇంటికి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తన సన్నిహితులు కూడా చాలా మంది వైరస్ బారిన పడుతున్నారని తెలిపారు. ఈ ఒమిక్రాన్ మహమ్మారి వల్ల మనమంతా చెత్త దశను చూడవచ్చని అభిప్రాయపడ్డారు. ఒమిక్రాన్ నేపథ్యంలో తన హాలిడే ప్లాన్లను కూడా రద్దు చేసుకున్నానని చెప్పారు.

చరిత్రలో అన్ని వైరస్ ల కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందని బిల్ గేట్స్ అన్నారు. ఒమిక్రాన్ మనల్ని ఎంత అనారోగ్యానికి గురి చేస్తుందనేది ఇప్పటి వరకు తెలియదని... దాని గురించి పూర్తిగా తెలిసేంత వరకు ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా మాస్కులు ధరించాలని చెప్పారు. ఎవరూ గుంపులుగా గుమికూడొద్దని సూచించారు. టీకాలు వేయించుకోవాలని, వ్యాక్సిన్ బూస్టర్ డోసు మరింత రక్షణను కల్పిస్తుందని చెప్పారు. కరోనాకు వ్యాక్సిన్లు బాగా పని చేస్తున్నాయని అన్నారు. అయితే 2022 నాటికి కరోనా మహమ్మారి ముగుస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పారు.


More Telugu News