పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. రాష్ట్రాలకు పలు సూచనలు చేసిన కేంద్ర ప్రభుత్వం!

  • దేశంలో 200 దాటిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు
  • పరిస్థితి చేయి దాటకముందే అన్ని చర్యలు తీసుకోవాలన్న కేంద్రం
  • 100 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచన
మన దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు ఎక్కువ ఇన్ఫెక్షన్ కలిగించే లక్షణం ఒమిక్రాన్ వేరియంట్ కు ఉంది. యూరప్, అమెరికాలను ఇప్పటికే ఒమిక్రాన్ వణికిస్తోంది. మన దగ్గర కూడా కేసులు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలు, యూటీలకు లేఖలు రాసింది. కేంద్రం చేసిన సూచనల్లో కంటైన్మెంట్లు, రాత్రిపూట కర్ఫ్యూలు, టెస్టింగ్, ట్రేసింగ్ తదితర అంశాలు ఉన్నాయి.

రాష్ట్రాలకు, యూటీలకు కేంద్ర ఆరోగ్యశాఖ రాసిన లేఖలోని ప్రధానాంశాలు ఇవే:
  • స్థానిక పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకోవాలి. 
  • గత వారం రోజుల్లో 10 శాతానికి మించి పాజిటివ్ కేసులు వచ్చినా, ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న ఐసీయూ బెడ్స్ 40 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలి. పరిస్థితి ఈ స్థాయికి రాకముందే తగు చర్యలు తీసుకోవాలి. కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలి. తగు ఆంక్షలు విధించాలి. అవసరమైతే రాత్రి పూట కర్ఫ్యూలను విధించాలి.
  • మన దేశంలోని పలు ప్రాంతాల్లో ఒమిక్రాన్ తో పాటు డెల్టా వేరియంట్ కూడా ఇప్పటికీ ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కంటైన్మెంట్ ప్రక్రియను ముమ్మరం చేయాలి. పరిస్థితి విషమించక ముందే కట్టుదిట్టమైన అన్ని చర్యలను తీసుకోవాలి.
  • టెస్టింగ్ ముమ్మరం చేయాలి. కరోనా పాజిటివ్ వచ్చిన వారిపై నిఘా ఉంచాలి. వారి కాంటాక్టులను ట్రేస్ చేయాలి. గడప గడపకూ వెళ్లి కేసులను గుర్తించాలి.
  • ఒక క్లస్టర్ లేదా ఒక సమూహంలో ఇన్ఫెక్షన్లను గుర్తించినప్పుడు వెంటనే వారి శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలి.
  • 100 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలి.
  • వైద్యరంగానికి సంబంధించిన ఆసుపత్రి బెడ్లు, అంబులెన్సులు, ఆక్సిజన్ పరికరాలు, మందులు తదితర మౌలిక వసతులను మెరుగుపరుచుకోవడానికి అత్యవసర నిధులను వినియోగించుకోవాలి.

మరోవైపు భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటింది. వీటిలో మహారాష్ట్ర, ఢిల్లీలలో సగానికి పైగా కేసులు నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, కేరళ, గుజరాత్ ఉన్నాయి.


More Telugu News