ఆందోళన వద్దు.. 80 శాతం ఒమిక్రాన్ కేసుల్లో లక్షణాలే లేవు: కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ

  • ఇప్పటి వరకు 161 ఒమిక్రాన్ కేసులు
  • 80శాతం కేసుల్లో లక్షణాలే లేవు
  • 13 శాతం కేసుల్లో స్వల్ప లక్షణాలు
  • టీకాల సామర్థ్యంపై వారంలో ఫలితాలు
ఒమిక్రాన్ రకం కరోనా కేసులు యూరోప్, అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా దేశాల్లో వేగంగా పెరుగుతుండం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. కాకపోతే మనదేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుదల ఇతర దేశాల్లో మాదిరి అంత వేగంగా ఇప్పటికైతే లేదు.

ఇదే సమయంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ చేసిన ప్రకటన కాస్తంత ఊరటనిచ్చేదిగా ఉంది. దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 161 బయటపడగా.. అందులో 80 శాతం కేసుల్లో అసలు లక్షణాలే లేవని మాండవీయ వెల్లడించారు. మరో 13 శాతం కేసుల్లోనూ స్వల్ప లక్షణాలే ఉన్నట్టు చెప్పారు.

ఇక ఒమిక్రాన్ బారిన పడిన వారిలో 44 మంది కోలుకున్నట్టు తెలిపారు. కాకపోతే ఒమిక్రాన్ ఇతర రకాలతో మ్యూటేట్ అయితే పెద్దవారు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారిలో తీవ్రత ఎక్కువగా ఉండొచ్చన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. పరిస్థితులను ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోందన్నారు.

 ల్యాబ్ లలో ఒమిక్రాన్ రకం వైరస్ పై టీకాల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెబుతూ.. మరో వారంలో ఫలితాలు వెల్లడవుతాయని మాండవీయ తెలిపారు. నిపుణులతో రోజువారీగా సమీక్ష నిర్వహిస్తున్నామని.. ఔషధాలు, ఆక్సిజన్ ను తగినంత అందుబాటులో ఉంచినట్టు చెప్పారు.

మరోపక్క, రాష్ట్రాలకు ఇప్పటి వరకు 48,000 వెంటిలేటర్లను పంపిణీ చేసినట్టు తెలిపారు. టీకాల ఉత్పత్తి సామర్థ్యం నెలవారీగా 31 కోట్లుగా ఉండగా, వచ్చే రెండు నెలల్లో అది 45 కోట్లకు పెరుగుతుందన్నారు. దేశంలో ఇప్పటికే 88 శాతం మంది (18 ఏళ్లు నిండిన వారిలో) టీకా మొదటి డోసు తీసుకున్నారని.. 58 శాతం మందికి రెండు డోసులు పూర్తయినట్టు వెల్లడించారు.


More Telugu News