ఐదు గంటల పాటు ఐశ్వర్యారాయ్ పై ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ అధికారులు

  • పనామా పత్రాల కేసులో ఈడీ సమన్లు
  • ఢిల్లీలో ఈడీ ఆఫీసుకు వచ్చిన ఐశ్వర్య
  • రాజ్యసభలో సహనం కోల్పోయిన జయాబచ్చన్
  • బీజేపీకి దుర్దినాలు రానున్నాయని శాపనార్థాలు
పనామా పత్రాల వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నేడు బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ను సుదీర్ఘ సమయం పాటు విచారించారు. ఢిల్లీలోని జామ్ నగర్ హౌస్ కార్యాలయానికి విచ్చేసిన ఐశ్వర్యపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. పనామా పేపర్ల కేసుతో సంబంధం ఉందన్న కారణంగా ఐశ్వర్యకు ఈడీ అధికారులు సమన్లు పంపడం తెలిసిందే.

ఇదిలావుంచితే, ఐశ్వర్యారాయ్ అత్త జయాబచ్చన్ నేడు బీజేపీపై రాజ్యసభలో ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ఐశ్వర్య ఢిల్లీ ఈడీ ఆఫీసు వద్దకు చేరుకున్నట్టు వార్తలు వచ్చిన అనంతరం జయాబచ్చన్ రాజ్యసభలో ప్రసంగిస్తూ, సభలో కొందరు వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపించారు. అయితే తాము ఎవరిపైనా వ్యక్తిగత దూషణలు చేయబోవడంలేదని, జరిగిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. వారు ఆవిధంగా మాట్లాడకుండా ఉండాల్సిందని బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. త్వరలోనే బీజేపీకి దుర్దినాలు రానున్నాయని శాపనార్థాలు పెట్టారు.


More Telugu News