టీమిండియా ఆటగాళ్లను కనీసం ఒకట్రెండు ఇతర లీగ్ లకు అనుమతించాలి: బీసీసీఐకి వసీం అక్రమ్ సూచన

  • టీ20 వరల్డ్ కప్ లో పాక్ చేతిలో భారత్ ఓటమి
  • నిప్పులు చెరిగే బౌలింగ్ చేసిన షహీన్ అఫ్రిది
  • ప్రపంచవ్యాప్తంగా లీగ్ లు ఆడితే అనుభవం వస్తుందన్న అక్రమ్
  • భారత ఆటగాళ్లలో అదే లోపించిందని వెల్లడి
పాకిస్థాన్ పేస్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ లో పాక్ చేతిలో ఓటమిపాలైన తర్వాత టీమిండియా కోలుకోలేకపోవడానికి గల కారణాలను అక్రమ్ విశ్లేషించాడు. షహీన్ షా అఫ్రిది సంచలన తొలి ఓవర్ తర్వాత భారత జట్టు కుదేలైందని, ఆ తడబాటు అలాగే కొనసాగిందని వివరించాడు.

"భారత ఆటగాళ్లు ఎక్కువగా ఐపీఎల్ పైనే దృష్టిసారిస్తారని తీవ్ర చర్చ నడుస్తోంది. అది నిజమే. భారత ఆటగాళ్లు ఇతర లీగుల్లో పాల్గొనడంలేదు. తద్వారా వారు అంతర్జాతీయ ఆటగాళ్లను ఎదుర్కోవడం కూడా తక్కువే. భారత్ జట్టులో చాలా కొద్దిమంది ఆటగాళ్లే గతంలో షహీన్ అఫ్రిదిని ఎదుర్కొన్నారు. హరీస్ రవూఫ్, హసన్ అలీల బౌలింగ్ ను ఎదుర్కోవడంలోనూ వారికి పెద్దగా అనుభవంలేదు.

ఇకనైనా బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను ఐపీఎల్ మాత్రమే కాకుండా, ఒకట్రెండు ఇతర లీగ్ ల్లోనూ ఆడించాలి. వివిధ దేశాల్లో లీగ్ లు ఆడడం ద్వారా ఆటగాళ్లు భిన్నమైన బౌలర్లను ఎదుర్కొని అనుభవం సంపాదిస్తారు. భిన్నమైన పిచ్ లు, భిన్నమైన జట్లు, భిన్నమైన పరిస్థితుల్లో ఆడడం ఎలాగో నేర్చుకుంటారు. ఐపీఎల్ డబ్బు పరంగా, ప్రతిభావంతుల పరంగా నెంబర్ వన్ లీగ్. కానీ భారత ఆటగాళ్లు ఇతర లీగ్ లలో కూడా ఆడితే మరింత మెరుగవుతారు. దీనిపై బీసీసీఐ పునరాలోచన చేయాలి" అని అక్రమ్ హితవు పలికాడు.


More Telugu News