ఒమిక్రాన్ వేరియంట్ పై రాజ్యసభలో కేంద్రం ప్రకటన

  • సభకు వివరణ ఇచ్చిన కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ
  • దేశంలో 161 ఒమిక్రాన్ కేసులున్నాయని వెల్లడి
  • ఔషధ నిల్వలకు లోటులేదని వివరణ
  • వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోందని స్పష్టీకరణ
డెల్టా వేరియంట్ ను మించిన వేగంతో వ్యాపిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై కేంద్ర ప్రభుత్వం నేడు రాజ్యసభలో ప్రకటన చేసింది. ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. అవసరమైన ఔషధ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రతిరోజూ నిపుణులతో పరిస్థితిని సమీక్షిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దేశంలో ప్రస్తుతం 161 ఒమిక్రాన్ కేసులున్నాయని పేర్కొన్నారు. తొలి, రెండో దశల నుంచి నేర్చుకున్న పాఠాలతో అప్రమత్తంగానే ఉన్నామని స్పష్టం చేశారు.

త్వరలోనే పిల్లల వ్యాక్సిన్ కూడా వస్తుందని, ప్రస్తుతం నెలకు 31 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయగల సత్తా భారత్ కు ఉందని వెల్లడించారు. మరో రెండు నెలల్లో నెలకు 45 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటామని వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద తగినంత మేర వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.

దేశంలో ఇప్పటివరకు 88 శాతం తొలి డోసు, 58 శాతం రెండో డోసు వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నామని కేంద్రమంత్రి రాజ్యసభలో చెప్పారు.


More Telugu News