ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో కార్ల యజమానులకు మారుతి కీలక సూచన

  • కంపెనీ నాణ్యమైన విడిభాగాలనే వినియోగించాలి
  • వాహనదారుల భద్రత తమకు ముఖ్యమని ప్రకటన
ఈ ఏడాది దేశంలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠాలకు చేరాయి. హైదరాబాద్ శివార్లలోనూ 9 డిగ్రీలకు పడిపోయింది. ఈ తరుణంలో దేశీ కార్ల దిగ్గజం మారుతి సుజుకీ వినియోగదారులకు కీలకమైన సూచన చేసింది. వాహనాలకు సంబంధించి తాము ఎప్పుడూ ప్రామాణికమైన, నాణ్యమైన విడిభాగాలనే అందిస్తుంటామని గుర్తు చేసింది. మారుతి సుజుకీ వాహనాలు, అందులో ప్రయాణిస్తున్న వారి భద్రత తమకు ఎంతో ముఖ్యమంటూ సదరు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

 కఠినమైన శీతల పరిస్థితుల్లోనూ కంపెనీ ఆఫర్ చేసే విడిభాగాలు తట్టుకుని నిలబడతాయని అందులో వివరించింది. ‘‘శీతలమైన చల్లటి కాలంలో ఉన్నాం. కస్టమర్ల ప్రయాణం సురక్షితంగా ఉండాలని మారుతి సుజుకీ కోరుకుంటోంది. శీతాకాలంలో వాహన భద్రతను పరిగణనలోకి తీసుకుని   ప్రత్యేకంగా నాణ్యమైన విడిభాగాలు, యాక్సెసరీలను కంపెనీ అందిస్తోంది’’ అంటూ మారుతి సుజుకీ తన ప్రకటనలో పేర్కొంది.

కేవలం మారుతి సుజుకీ అచ్చమైన, నాణ్యమైన విడిభాగాలు, ఉత్పత్తులనే వినియోగించుకోవాలని కోరింది. మారుతి సుజుకీ మోడళ్లకు అనుకూలంగా వాటిని తయారు చేసినట్టు తెలిపింది. కంపెనీ విడిభాగాలనే వినియోగించడం వల్ల పనితీరు మెరుగ్గా ఉంటుందని, ప్రమాదాల రిస్క్ తగ్గుతుందని పేర్కొంది. నాసిరకం ఉత్పత్తులను వినియోగించడం వల్ల కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో భద్రతకు రిస్క్ ఉంటుందని కంపెనీ పరోక్షంగా వినియోగదారులను అప్రమత్తం చేసినట్టుగా దీన్ని చూడొచ్చు. జనవరి 1 నుంచి కార్ల ధరలను పెంచనున్నట్టు మారుతి ఇప్పటికే ప్రకటించింది.


More Telugu News