రికార్డు స్థాయిలో పన్నులు కడుతున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్!

  • స్టాక్ ఆప్షన్లను వినియోగించుకున్నందుకు పన్ను భారం
  • 2021లో రూ.85,000 కోట్లు చెల్లించే అవకాశం
  • అమెరికా చరిత్రలోనే ఇదొక రికార్డు 
ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు అధిపతి అయిన ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. కానీ, ఆయన కట్టే పన్నుల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ప్రపంచ బడా సంపన్నుల్లో మస్క్ కూడా ఒకడు. తాను ఈ ఏడాది ఏకంగా 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ.85,000 కోట్లు) పన్నులు చెల్లించనున్నట్టు ట్విట్టర్ లో తాజాగా వెల్లడించారు.

మస్క్ తన కంపెనీలో తనకున్న స్టాక్ ఆప్షన్లను వినియోగించుకున్నందుకు ఈ మేర పన్ను భారం పడనుంది. మస్క్ ఇప్పటికే 15 మిలియన్ల స్టాక్ ఆప్షన్లను, స్టాక్స్ ను భారీగా అమ్మేశారు. టెస్లాలో తనకున్న వాటాలో 10 శాతం వాటాను విక్రయించాలా? వద్దా? అంటూ ఆయన ట్విట్టర్ పై పోల్ కూడా నిర్వహించారు. మెజారిటీ ఫాలోవర్లు విక్రయించడమే నయమనడంతో ఆ పని కూడా చేసేశారు.

తాను టెస్లాలో కానీ, స్పేస్ఎక్స్ లో కానీ వేతనాన్ని తీసుకోలేదని, స్టాక్ ఆప్షన్లను తీసుకున్నందుకు 53 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోందంటూ ఆయన వాపోయాడు. అమెరికా చరిత్రలోనే ఒక ఏడాదితో అత్యధిక పన్ను చెల్లించబోతున్నట్టు ఈ నెల మొదట్లోనూ ఎలాన్ మస్క్ ప్రకటించారు.
 
మరోపక్క, అమెరికాలో ఇతర సంపన్నుల్లో కొందరి మాదిరే.. ఎలాన్ మస్క్ కూడా పన్నులు ఎగవేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. 2014-2017 మధ్య 455 మిలియన్ డాలర్ల మేర మస్క్ పన్నులుగా చెల్లించగా.. ఆయన సంపద మాత్రం 13.8 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్టు ఒక నివేదిక తేల్చింది. కంపెనీ నుంచి వేతనం తీసుకోకుండా ఉండడం ద్వారా 2018లో రూపాయి కూడా పన్ను కట్టలేదు. ఇప్పుడు కంపెనీలో ఆయన వాటాల విలువ గణనీయంగా పెరగడం, వాటిని విక్రయించడం వల్ల భారీ మొత్తమే చెల్లించుకోవాల్సి వస్తోంది.


More Telugu News