స్వతంత్ర భారతదేశంలో థర్డ్ డిగ్రీ దెబ్బలు తిన్న తొలి ఎంపీని నేనే: ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో ఎంపీ రఘురామ కృష్ణరాజు

  • నన్ను చిత్రహింసలకు గురిచేస్తూ దానిని ఫోన్‌లో ‘పైవాడికి’ చూపించారు
  • జగన్‌కు, నాకు గ్యాప్ రావడానికి కారణం అదే అనుకుంటున్నా
  • అపాయింట్‌మెంట్ కేన్సిల్ చేయడాన్ని అవమానంగా భావించా
  • వైఎస్‌తో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి
  • పిల్లల ముక్కు తుడిస్తే జగన్ మారిపోయారనుకున్నా
స్కూల్లో తాను మంచి విద్యార్థినని, అందుకని బడిలో ఎప్పుడూ దెబ్బలు తినలేదని, తన ఒంటిపై పడిన తొలి దెబ్బే పోలీస్ దెబ్బని నర్సాపురం ఎంపీ, వైసీపీ రెబల్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఎంపీని అయి ఉండీ కొట్టించుకోవడం ఓ రికార్డని, తనను మామూలుగా కొట్టలేదంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వహించే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో రఘురామరాజు నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన పలు విషయాలను వెల్లడించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి వైఎస్సార్‌తో తనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రఘురామ రాజు పేర్కొన్నారు. పులివెందుల వాళ్లకు ఏదైనా పని అవసరమైతే వెంటపడేవారని గుర్తు చేసుకున్నారు. మళ్లీ తనకు ఫోన్ చేయవద్దని, పని పూర్తయ్యాక తానే కాల్ చేస్తానని చెప్పేంత చనువు తనకు ఉండేదని పేర్కొన్నారు.

తనను పార్లమెంటు లెజిస్లేషన్ సబార్డినేట్ కమిటీకి అధ్యక్షుడిగా నియమించారని, దీంతో జగన్‌కు కృతజ్ఞతలు చెప్పాలని అపాయింట్‌మెంట్ తీసుకుని తన ఎత్తున్న పెద్ద బొకేతో ప్రత్యేక విమానంలో వచ్చానని పేర్కొన్నారు. అయితే, ఇక్కడికి వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, అపాయింట్‌మెంట్ రద్దయినట్టు చెప్పడంతో భరించలేనంత అవమానంగా ఫీలయ్యానని చెప్పారు. తెచ్చిన బొకేను వేస్ట్ చేయకూడదన్న ఉద్దేశంతో గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరితే వెంటనే లభించిందని, దీంతో ఆ బొకేను తీసుకెళ్లి ఆయనకు ఇచ్చానని తెలిపారు.  

కృతజ్ఞతలు చెబుదామని వెళ్లిన తన ముఖం చూసేందుకు కూడా జగన్ ఇష్టపడలేదని, అది నాకు కోపం తెప్పించిందని అన్నారు. ఓసారి జగన్ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. కొందరు ఎంపీలు కేంద్రమంత్రులను కలుస్తున్నారని, సాయిరెడ్డి అన్న, మిథునన్న తప్ప ఎవరూ కలవకూడదని తన పేరు కూడా చెప్పకుండా అన్నారని, దీంతో తన గురించే చెబుతున్నారని అర్థమైందని రఘురామరాజు అన్నారు.

పోలీసులు తనను కొట్టిన విషయాన్ని ప్రధానితో చెప్పినట్టు రఘురామ చెప్పారు. జగన్‌లో అపరిచితుడి లక్షణాలు ఉన్నాయని ఎనిమిదేళ్ల క్రితమే గుర్తించానని, అయితే, పాదయాత్ర తర్వాత ఆయన పూర్తిగా మారిపోయారని ప్రశాంత్ కిశోర్ చెప్పడంతో నమ్మేశానని అన్నారు. పాదయాత్రలో జగన్ పిల్లల ముక్కులు తుడవడం చూసి నిజంగానే మారిపోయారని అనుకున్నానని అన్నారు.

కానీ, పోలీసు దెబ్బలు తినాలని రాసుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారని నిర్వేదం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన తీసుకునే నిర్ణయాలతో పార్టీ భవిష్యత్తు దెబ్బ తింటోందన్న ఆవేదనతోనే పాదయాత్రలో జగన్ ఏమన్నారో ప్రతి రోజు చెబుతున్నానని పేర్కొన్నారు.

పోలీసులు తన ఇంటిపై దాడిచేసి తనను ఎత్తి జీపులో పడేశారని, ఆపై పోలీస్ స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేశారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర భారతదేశంలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన తొలి ఎంపీని తానేనని, ఇదో రికార్డని అన్నారు. ఓ అధికారి తనను హింసించారని, అయితే, ఆయన ఎవరన్నది ఇప్పుడు వెల్లడించనని చెప్పారు.

ఇక తనను చిత్రహింసలకు గురిచేస్తుండగా ఫోన్‌లో ‘పై వాడికి’ చూపించారని, ఆయన ఆనందించారని రఘురామరాజు వ్యాఖ్యానించారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి భూముల విక్రయం విషయంలో తాను అడ్డుచెప్పానని పేర్కొన్న రఘురామరాజు.. పార్లమెంటులో మాతృభాషపై మాట్లాడిన తర్వాతే జగన్‌కు, తనకు మధ్య గ్యాప్ పెరిగిందని అన్నారు.


More Telugu News