నెట్‌లో ప్రాక్టీస్ చేసిన కోహ్లీ.. వీడియో ఇదిగో

  • టీమిండియా-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు
  • ఈ నెల‌ 26 నుంచి ప్రారంభం
  • టీమిండియా ప్రాక్టీస్ షురూ
  • ద్ర‌విడ్ ఆధ్వ‌ర్యంలో కోహ్లీ సాధ‌న‌
టీమిండియా-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ డిసెంబ‌ర్ 26 నుంచి ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన‌ వీడియోను బీసీసీఐ త‌మ అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ఆధ్వ‌ర్యంలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రాక్టీసు చేశాడు. ఈ సంద‌ర్బంగా వారు ఫుట్ బాల్ కూడా ఆడారు. ప్రాక్టీస్‌లో భాగంగా రెండు జ‌ట్లుగా విడిపోయారు భార‌త ఆట‌గాళ్లు. వాటిలో ఒక జ‌ట్టుకి ద్ర‌విడ్ నాయ‌కత్వం వ‌హించ‌గా, మ‌రొక జ‌ట్టుకి కోహ్లీ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు.

ఫుట్‌బాట్ తో పాటు వాలీబాల్ కూడా ఆడారు. వ‌న్డే టీమ్ నుంచి కోహ్లీని సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించిన విష‌యం తెలిసిందే. దీంతో బీసీసీఐ-కోహ్లీకి మ‌ధ్య‌ వివాదం కొన‌సాగుతోంద‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో కోహ్లీ జ‌ట్టు స‌భ్యుల‌తో క‌లిసి ఎప్ప‌టిలాగే ప్రాక్టీస్ చేస్తుండ‌డం అభిమానుల‌ను అల‌రిస్తోంది.

కాగా, ద‌క్షిణాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న‌ మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ను బీసీసీఐ ఇప్ప‌టికే నియమిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. నిజానికి అజింక్యా రహానె స్థానంలో ఈ సిరీస్‌ నుంచే వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు రోహిత్‌ శర్మ తీసుకోవాల్సి ఉంది. అయితే, ఆయ‌న గాయపడటంతో దక్షిణాఫ్రికాకు రోహిత్ శ‌ర్మ‌ వెళ్లలేదు. ఈ నేప‌థ్యంలోనే తాత్కాలిక వైస్ కెప్టెన్‌గా రాహుల్‌ను బీసీసీఐ నియమించింది. ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా టెస్ట్ సిరీస్‌తో పాటు భార‌త్‌ వ‌న్డే సిరీస్ కూడా ఆడ‌నుంది.


More Telugu News