కోహ్లీని ఇంత‌లా కించపరిచే హక్కు వాళ్లకు లేదు: టీమిండియా మాజీ ఆల్ రౌండర్‌ కీర్తి ఆజాద్

  • సెలక్టర్లు వ్యవహరించిన తీరు స‌రికాదు
  • వన్డే కెప్టెన్సీ నుంచి తొలగింపు స‌రైన అంశ‌మే కావ‌చ్చు
  • ఈ విష‌యాన్ని చెప్పిన విధానం మాత్రం బాగోలేదు
  • కోహ్లీ ప‌ట్ల బీసీసీఐ సెలక్టర్లు గౌరవంగా ఉంటే బాగుండేది
  • తొలగింపుపై కోహ్లీకి చెప్పి ఉంటే హుందాగా ఉండేది
కోహ్లీని టీమిండియా వన్డే సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి తొల‌గిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణ‌యంపై ప‌లువురు మాజీ క్రికెటర్లు త‌మ అభిప్రాయాలు తెలుపుతున్నారు. టీమిండియా మాజీ ఆల్ రౌండర్‌ కీర్తి ఆజాద్ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ కోహ్లీకి మద్దతుగా నిలిచారు. ఈ విష‌యంలో సెలక్టర్లు వ్యవహరించిన తీరును ఆయ‌న‌ తప్పుబ‌ట్టారు.

కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు ప్ర‌క‌ట‌న చేయ‌డం స‌రైన అంశ‌మే అయి ఉండొచ్చ‌ని. అయితే, ఈ విష‌యాన్ని చెప్పిన విధానం మాత్రం బాగోలేద‌ని ఆయ‌న అన్నారు. టీమిండియాకు కెప్టెన్‌గా కోహ్లీ ఎన్నో గొప్ప విజయాలు అందించాడని, ఇప్పటికే ఆయ‌న‌ ఎన్నో మ్యాచ్‌లు ఆడి మంచి అనుభవం సంపాదించా‌డ‌ని చెప్పారు.

టీమిండియాలో కోహ్లీ ఒక సీనియర్‌ క్రికెటర్‌గా కొన‌సాగుతున్నాడ‌ని తెలిపారు. కోహ్లీ ప‌ట్ల బీసీసీఐ సెలక్టర్లు గౌరవంగా ఉంటే బాగుండేదని, కెప్టెన్సీ తొలగింపుపై కోహ్లీకి చెప్పి ఉంటే హుందాగా ఉండేద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రస్తుతం ఉన్న సెలక్టర్లు గొప్పవాళ్లు  అయి ఉండొచ్చ‌ని, అయిన‌ప్ప‌టికీ కోహ్లీ ఆడిన మ్యాచ్‌ల్లో వారు సగం కూడా ఆడలేదని విమ‌ర్శించారు.

కోహ్లీ ఇంత‌లా కించపరిచే హక్కు వాళ్లకు లేదని సూటిగా చెప్పారు. తాను గ‌తంలో జాతీయ సెలక్టర్‌గా ఉన్న సమయంలో ముందు జట్టును ఎంపిక చేసిన అనంత‌రం ఈ విష‌యాన్ని ప్రెసిడెంట్‌ దగ్గరకు తీసుకెళ్లే వాళ్ల‌మ‌ని తెలిపారు. ప్రెసిడెం‌ట్ ఒకసారి పరిశీలించి ఓకే అన్న తర్వాతే జట్టును ప్రకటించేవారమని, ఇది నిబంధ‌న‌ల ప్ర‌కారం జరిగేదని చెప్పారు. అయితే, ఇప్పుడు దానిని ప్రస్తుతం పూర్తిగా మార్చేశారని తెలిపారు. 


More Telugu News