ఇటువంటి వారి వల్లే ప్రపంచం మరింత అందంగా కనిపిస్తుంది: సచిన్ టెండూల్కర్

  • సచిన్ స్నేహితురాలికి రోడ్డు ప్రమాదంలో గాయాలు
  • వెన్నెముకకు బలమైన దెబ్బలు
  • ఎంతో జాగ్రత్తగా ఆసుపత్రికి తీసుకెళ్లిన ట్రాఫిక్ పోలీసు
  • కోలుకున్న సచిన్ క్లోజ్ ఫ్రెండ్
  • ట్రాఫిక్ పోలీసులను కలిసి థ్యాంక్స్ చెప్పిన సచిన్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. విధి నిర్వహణను మించి సేవలు అందించేవారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.

"కొన్నిరోజుల కిందట నా క్లోజ్ ఫ్రెండ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. దేవుడి దయ వల్ల ఆమె ఇప్పుడు క్షేమంగానే ఉంది. ఆమె ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడానికి కారణం ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. అతడి వల్లే ఆమె ఇవాళ జీవించి ఉంది. సీరియస్ కండిషన్ లో ఉన్న ఆమెను ఆ కానిస్టేబుల్ ఓ ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె వెన్నెముకకు బాగా దెబ్బలు తగిలాయి. ఆటోలో కుదుపులకు వెన్నెముక మరింత గాయపడే అవకాశం ఉండడంతో, కుదుపులకు గురికాకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరుండి మరీ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఇప్పుడామె కోలుకుంది.

ఈ నేపథ్యంలో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను కలిశాను. అతడు చేసిన సాయం పట్ల కృతజ్ఞతలు తెలిపాను. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో అతడి లాంటి మంచివాళ్లు చాలామంది ఉన్నారు. వారందరూ తమ విధి నిర్వహణను మించి సాయపడేందుకు సిద్ధంగా ఉంటారు. ఇలాంటి వారి వల్లే ప్రపంచం నేటికీ అందంగా కనిపిస్తోంది. మనకు ఎప్పుడైనా ఇలాంటి పరోపకారులు కనిపిస్తే ఒక్క క్షణం ఆగైనా సరే వారిని అభినందించాలి. వాళ్లెవరో మనకు తెలియకపోవచ్చు... కానీ ఇతరుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు నిశ్శబ్దంగా పనిచేస్తుంటారు.

ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు కృషి చేస్తున్న దేశంలోని ట్రాఫిక్ పోలీసులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం కూడా మనవంతు ధర్మాన్ని నిర్వర్తించాలి. రోడ్డుపై వెళ్లేటప్పుడు నిబంధనలు ఉల్లంఘించకుండా తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. తద్వారా మనల్ని మనం కాపాడుకోవడమే కాదు, మనవల్ల ఇతరులకు హాని కలగకుండా చూడొచ్చు" అంటూ సచిన్ టెండూల్కర్ తన పోస్టులో పేర్కొన్నారు.


More Telugu News