యూరప్ లో ఒమిక్రాన్ విజృంభణ... అత్యవసరమైతేనే ప్రయాణించాలన్న కేంద్రం

  • మరింత పెరుగుతున్న ఒమిక్రాన్ కలకలం
  • యూరప్ దేశాల్లో భారీగా కొత్త కేసులు
  • వ్యాక్సినేషన్ తో సంక్షోభం సమసిపోదన్న కేంద్రం
  • మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరి అని సూచన 
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లోనూ ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా 100 దాటింది. ఈ నేపథ్యంలో ప్రజలకు కేంద్రం పలు సూచనలు చేసింది. యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ విజృంభిస్తోందని, అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయొద్దని పేర్కొంది. భారత్ లో ప్రస్తుతం 101 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ 11 రాష్ట్రాల్లో గుర్తించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 32 కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 22, రాజస్థాన్ లో 17 కేసులు వెల్లడయ్యాయి.

అటు ప్రపంచ దేశాల్లోనూ కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియా సమావేశం నిర్వహించారు.

"గతంలో ఏ కరోనా వేరియంట్ ఇంత వేగంగా వ్యాపించలేదు. ఒమిక్రాన్ వీటన్నింటినీ మించి పాకిపోతోంది. ఒమిక్రాన్ తో పెద్దగా ప్రమాదం లేదని, ఇది స్వల్ప లక్షణాలనే కలుగజేస్తుందని ప్రజలు తేలిగ్గా తీసుకోవడం మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తోంది. పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు వస్తే ఆసుపత్రుల్లో మునుపటి పరిస్థితులే కనిపిస్తాయి. ఆరోగ్య వ్యవస్థలు కూడా సన్నద్ధంగా లేవు.

కేవలం వ్యాక్సినేషన్ తోనే ఈ సంక్షోభం సమసిపోతుందని భావించలేం. మాస్కులు, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్, ధారాళంగా గాలి వచ్చే గదుల్లో ఉండడం వంటి చర్యలను పాటించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ రోజువారీ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. యూకే, డెన్మార్క్, నార్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. ఆయా దేశాల్లో కొవిడ్ కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి" అని వివరించారు.


More Telugu News