అది రైతుల ఉద్యమం కాదు... టీడీపీ దగ్గరుండి చేయిస్తోంది: మంత్రి పెద్దిరెడ్డి

  • తిరుపతిలో రాజధాని రైతుల సభ
  • హాజరైన విపక్షాలు
  • నైతిక విలువలకు తిలోదకాలిచ్చారన్న పెద్దిరెడ్డి 
  • మూడు రాజధానులే తమ విధానం అని స్పష్టీకరణ
తిరుపతిలో రాజధాని రైతులు భారీ సభ ఏర్పాటు చేయగా, టీడీపీ అధినేత చంద్రబాబు, వామపక్ష అగ్రనేతలు నారాయణ, రామకృష్ణ, బీజేపీ నేతలు, జనసేన ప్రతినిధులు హాజరవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.

నైతిక విలువలకు తిలోదకాలిచ్చిన పార్టీలన్నీ ఇవాళ ఏకతాటిపైకి వచ్చాయని అన్నారు. తోక పార్టీలతో కలిసి చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ ను పదవి నుంచి దింపాలన్న లక్ష్యంతో టీడీపీ, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ ఒకే వేదికపైకి వచ్చాయని, చరిత్రలో ఇలా ఎన్నడూ లేదని వ్యాఖ్యానించారు. ఎన్ని పార్టీలు వచ్చినా వైసీపీ ఒంటరిగానే బరిలో దిగుతుందని స్పష్టం చేశారు.

ఏపీకి మూడు రాజధానులు అన్నదే తమ నిర్ణయం అని, అందులో ఎలాంటి మార్పు లేదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. కానీ టీడీపీ దగ్గరుండి అమరావతి ఉద్యమం నడిపిస్తోందని ఆరోపించారు. చంద్రబాబుతో కలిసిన ఎంపీ రఘురామకృష్ణరాజు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


More Telugu News