వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న మహిళకు రూ.8 లక్షల జరిమానా!

  • నవీ ముంబయిలో ఘటన
  • ఓ ఎన్నారై కాంప్లెక్స్ లో వీధి కుక్కల సందడి
  • వీధి కుక్కలకు ఆహారం పెడితే రోజుకు రూ.5 వేల ఫైన్
  • అన్షు సింగ్ అనే మహిళకు భారీ జరిమానా
వీధి కుక్కలపై ఎంతో దయ చూపుతూ వాటికి ఆహారం అందిస్తున్నందుకు ఓ మహిళ లక్షల్లో జరిమానాకు గురైంది. ఈ ఘటన నవీ ముంబయిలో జరిగింది. ఓ ఎన్నారై గృహ సముదాయంలో నివసించే అన్షు సింగ్ అనే మహిళ రోజూ వీధి కుక్కలకు ఆహారం పెడుతోంది. ఆ గృహ సముదాయంలో 40 వరకు ఇళ్లు ఉన్నాయి. అయితే తమ హౌసింగ్ కాంప్లెక్స్ లో వీధి కుక్కలతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఇతరులు మేనేజింగ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ అన్షు సింగ్ పై తమ నిబంధనల మేరకు జరిమానా విధించింది.

ఆ హౌసింగ్ కాంప్లెక్స్ లో వీధికుక్కలకు ఆహారం వేస్తే రోజుకు రూ.5 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన అన్షు సింగ్ కు ఇప్పటివరకు విధించిన జరిమానాల మొత్తం రూ.8 లక్షలకు చేరింది. కాగా ఇదే కాంప్లెక్స్ లో నివసించే లీలా వర్మ అనే మహిళ మాట్లాడుతూ, కాంప్లెక్స్ లోపల వీధి కుక్కలకు ఆహారం పెట్టే వారి పేర్లను వాచ్ మన్ నమోదు చేసుకుంటాడని వెల్లడించారు.

ఈ ఘటనపై హౌసింగ్ కాంప్లెక్స్ కార్యదర్శి వినీత శ్రీనందన్ స్పందిస్తూ, తమ గృహ సముదాయం లోపల వీధి కుక్కలు యథేచ్ఛగా సంచరిస్తుండడంతో పిల్లలు ట్యూషన్లకు వెళ్లలేకపోతున్నారని, వృద్ధులు అసౌకర్యానికి గురవుతున్నారని వివరించారు. అంతేకాకుండా పార్కింగ్ ప్రదేశంలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ కుక్కలు అపరిశుభ్రతకు కారణమవుతున్నాయని, కాంప్లెక్స్ లోపల కుక్కలతో రణరంగంలా మారిందని పేర్కొన్నారు. దాంతో ఇక్కడ నివాసం ఉండేవారు సరిగా నిద్ర పోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు. వీధి కుక్కల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నప్పటికీ, వాటికి బహిరంగ ప్రదేశాల్లో ఆహారం అందిస్తున్నారని వినీత ఆరోపించారు.


More Telugu News