సీఎం జ‌గ‌న్‌తో బుగ్గ‌న‌, స‌జ్జ‌ల మ‌రోసారి కీల‌క భేటీ

  • పీఆర్సీపై చ‌ర్చ‌లు
  • అనంత‌రం ఉద్యోగ సంఘాల‌తో భేటీ
  • పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి ప్ర‌భుత్వం హామీ
  • ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల ప్ర‌క‌ట‌న‌
సీఎం జగన్ తో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న స‌మావేశమై పీఆర్సీపై చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఈ రోజు కూడా జగన్ తో బుగ్గ‌న‌, స‌జ్జ‌ల స‌మావేశ‌మై అదే అంశంపై చ‌ర్చ‌లు జ‌రిపారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉద్యోగులు ఇచ్చిన డిమాండ్లపై సీఎంకు వారు వివరించారు.

జ‌గ‌న్‌తో స‌మావేశం అనంత‌రం ఉద్యోగ‌ సంఘాల‌తో బుగ్గ‌న‌, స‌జ్జ‌ల‌ మ‌రోసారి భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కూడా ఉద్యోగ సంఘాలతో చర్చల్లో పాల్గొన్నారు. పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ప్రభుత్వం హామీ ఇచ్చినందున తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించాయి. అలాగే, పెండింగ్‌లో ఉన్న 71 డిమాండ్లను ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అన్ని సమస్యలు ఒక్క రోజులో పరిష్కారం అయ్యేవి కావని, చాలా సమస్యలు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.


More Telugu News