ఆసియా చాంపియన్స్ హాకీ ట్రోఫీ.. నేడు భారత్-పాక్ ఢీ

  • ఢాకాలో జరుగుతున్న ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ
  • నేటి మధ్యాహ్నం మూడు గంటలకు మ్యాచ్
  • గెలిస్తే సెమీస్‌కు భారత్
క్రీడ ఏదైనా, ఏ స్థాయిలో అయినా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే అది ఎప్పటికీ ఆసక్తే. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన పోరును ప్రపంచం మొత్తం వీక్షించింది. మొత్తం మ్యాచుల్లో ఈ ఒక్కదానికే అత్యధిక వ్యూస్ లభించాయి.

ఈ క్రమంలో నేడు మరోమారు ఈ రెండు దేశాలు తలపడబోతున్నాయి. అయితే, ఈసారి హాకీలో. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరుగుతున్న ఆసియా చాంపియన్స్ టోర్నమెంటు రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో నేటి మధ్యాహ్నం మూడు గంటలకు భారత్-పాక్ తలపడనున్నాయి.

2018లో మస్కట్‌లో జరిగిన టోర్నీ ఫైనల్ వర్షం కారణంగా రద్దుకావడంతో ఇరు జట్లు టోర్నీని పంచుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ నేడు డిఫెండింగ్ చాంపియన్లుగా ఇరు జట్లు తలపడనున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్యం గెలుచుకుని దశాబ్దాల తర్వాత భారత్‌కు హాకీలో పతకాన్ని అందించింది. ఇక ఈ టోర్నీలో కొరియాతో జరిగిన తొలి మ్యాచ్‌ను భారత్ 2-2తో డ్రా చేసుకుంది. ఆ తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 9-0తో చిత్తు చేసింది.

ఇప్పుడు ఇదే జోరు కొనసాగించి పాక్‌ను మట్టికరిపించాలని పట్టుదలగా ఉంది. అయితే, చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ జట్లు ఇప్పటి వరకు 9 సార్లు తలపడగా పాకిస్థాన్ ఏడుసార్లు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కనుక భారత్ గెలిస్తే సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.


More Telugu News