పుకార్లకు ఒక ఫొటో.. రెండు ముక్కలతో జవాబు చెప్పిన రవీంద్ర జడేజా

  • వన్డేలు, టీ20ల కోసం టెస్టులకు దూరమవుతున్నాడని కథనాలు
  • ఇంకా చేయాల్సింది చాలా ఉందంటూ జడ్డూ ట్వీట్
  • బూటకపు స్నేహితులు పుకార్లనే నమ్ముతారంటూ కామెంట్
టీమిండియా ఇవాళ సౌతాఫ్రికా విమానం ఎక్కేసింది. టెస్ట్ టీమ్ అక్కడకు బయల్దేరిపోయింది. అయితే, ఆ విమానంలో ఇద్దరు లేరు. ఒకరు రోహిత్ శర్మ.. ఇంకొకరు రవీంద్ర జడేజా. నెట్స్ లో ప్రాక్టీస్ సందర్భంగా గాయపడి హిట్ మ్యాన్ దూరమయ్యాడు. రవీంద్ర జడేజా కూడా గాయం వల్లే జట్టుకు దూరమయ్యాడు. న్యూజిలాండ్ తో తొలి టెస్టు సందర్భంగా జడ్డూ కుడిచేతికి గాయమైంది. ప్రస్తుతం దానికి అతడు చికిత్స తీసుకుంటున్నాడు.

అయితే, ఆ గాయం తీవ్రత చాలా ఎక్కువని, దానికి శస్త్రచికిత్స అవసరమని పేర్కొంటూ జాతీయ వార్తా సంస్థలు కథనం ప్రచురించాయి. గాయం కారణంగా తన వన్డే, టీ20 కెరీర్ దెబ్బ తినకూడదన్న ఉద్దేశంతో టెస్టుల నుంచి తప్పుకొంటున్నాడనీ రాశాయి. దాంతో అతడి కెరీర్ పై ఎన్నెన్నో పుకార్లు చక్కర్లు కొట్టాయి.


వాటన్నింటికీ ఒక ఫొటో.. రెండు ముక్కల్లో జవాబు చెప్పాడు జడ్డు. టెస్ట్ జెర్సీలో ఉన్న ఫొటో పోస్ట్ చేసి.. ‘‘చేయాల్సింది ఇంకా చాలా ఉంది’’ అంటూ ట్వీట్ చేశాడు. మరో ట్వీట్ లో ‘‘బూటకపు స్నేహితులు పుకార్లనే నమ్ముతారు. అసలైన నేస్తాలు నిన్ను నమ్ముతారు’’ అని పేర్కొన్నాడు. జడేజాకు మామూలుగానే గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం అతడు తన ఫాంహౌస్ లో గుర్రపు స్వారీ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు కూడా. దానికి సంబంధించిన ఓ వీడియోనూ రెండు రోజుల క్రితం పోస్ట్ చేశాడు.

కాగా, విదేశీ టూర్లకు జడ్డూనే మొదటి ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ టూర్ కు అశ్విన్ స్థానంలో జడ్డూనే ఎంపిక చేశారు. 57 టెస్ట్ మ్యాచ్ లాడిన జడేజా 232 వికెట్లు పడగొట్టాడు. కొన్నేళ్లుగా బ్యాటుతోనూ రాణిస్తున్నాడు. ఒక శతకం, 17 అర్ధ శతకాలతో 2,195 పరుగులు చేశాడు.


More Telugu News