ఆర్యన్ కు పాత షరతు కొట్టివేత.. కొత్త షరతు పెట్టి ట్విస్ట్ ఇచ్చిన బాంబే హైకోర్టు

  • ప్రతి శుక్రవారం ఎన్సీబీ ఆఫీసుకు వెళ్లాలని గతంలో కోర్టు ఆదేశం
  • కేసు సిట్ కు బదిలీ అయినందున ఆ షరతు తొలగించాలని ఆర్యన్ పిటిషన్
  • దాని నుంచి మినహాయింపునిచ్చిన కోర్టు
  • విచారణకు సిట్ పిలిచినప్పుడల్లా ఢిల్లీ వెళ్లాలంటూ కొత్త షరతు
డ్రగ్స్ కేసులో షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఊరట లభించింది. ఇప్పటిదాకా ప్రతి శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆఫీసుకు వచ్చి వెళ్లాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఇకపై అలా ఎన్సీబీ ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఆర్యన్ కు బాంబే హైకోర్టు ఊరటనిచ్చింది. ఆ బెయిలు షరతును కొట్టేసింది. అయితే, ప్రత్యేక దర్యాప్తు బృందానికి మాత్రం సహకరించాలని, విచారణకు అవసరమైనప్పుడు పిలిస్తే ఢిల్లీకి వెళ్లాలనే కొత్త షరతు విధించింది.

ఎన్సీబీ ఆఫీసుకు వెళ్లాలన్న షరతును కొట్టేయాలని కోరుతూ ఆర్యన్ ఖాన్ వేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు ఇవాళ విచారించింది. తాను ప్రతి శుక్రవారం ఆఫీసుకు వెళ్తుంటే మీడియా తనను అనుసరిస్తోందని, పోలీసులనూ వెంటబెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని పిటిషన్ లో ఆర్యన్ పేర్కొన్నాడు. పైగా కేసు ప్రస్తుతం ఢిల్లీలోని సిట్ కు బదిలీ అయినందున ముంబైలోని ఎన్సీబీ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని వాదించాడు. అందుకు అంగీకరించిన హైకోర్టు ప్రతి శుక్రవారం ఎన్సీబీ ఆఫీసుకు రావాలన్న షరతును కొట్టేసింది.


More Telugu News