కేంద్రంపై కలిసి పోరాడదామన్న కేసీఆర్.. సరేనన్న స్టాలిన్

  • రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది
  • సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది
  • బీజేపీని ఎదుర్కొనేందుకు బలమైన కూటమి ఏర్పాటుపై చర్చ
  • కేంద్రంపై కలిసి పోరాడాలని నిర్ణయం
తమిళనాడులో కుటుంబ సమేతంగా పర్యటిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు ఇద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని నేతలిద్దరూ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్ధంగా సెస్‌ల విధింపు, నీతి ఆయోగ్ సిఫారులను పట్టించుకోకపోవడం, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం, పన్నుల వాటాల తగ్గింపు వంటి వాటిని తప్పుబట్టారు. అలాగే, విభజన హామీలను విస్మరించడం, కరోనా టీకాల విషయంలో వైఫల్యం, ఇంధన ధరల పెంపు, పోటీ పరీక్షల్లో దక్షిణాది భాషలకు ప్రాధాన్యం దక్కకపోవడం వంటివాటిపైనా ఇరువురు నేతలు చర్చించారు.

బీజేపీని ఎదుర్కొనేందుకు బలమైన కూటమి ఏర్పాటు అవసరమన్న అభిప్రాయానికి వచ్చిన సీఎంలు.. దానిపై జాతీయ స్థాయిలో కార్యాచరణ గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. కేంద్ర ఏకపక్ష ధోరణిపై దక్షిణాది వాణిని బలంగా వినిపించాలని నిర్ణయించారు. బీజేపీ వ్యతిరేక కూటమి రూపకల్పనలో క్రియాశీలంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు.


More Telugu News