జగన్ అక్రమాస్తుల కేసు.. పిటిషన్ ఉపసంహరించుకున్న దాల్మియా సిమెంట్స్

  • సీబీఐ కోర్టు విచారణను నిలివేయాలని కోరుతూ 2016లో దాల్మియా పిటిషన్ 
  • విచారణను నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు
  • చట్టప్రకారం పరిష్కారం కనుగొంటామని చెప్పిన దాల్మియా  
  • ఐదేళ్లుగా కొనసాగుతున్న స్టే ఉత్తర్వుల రద్దు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టులో నిన్న కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టులో నిన్న ఉపసంహరించుకున్నారు. అందుకు అనుమతినిచ్చిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. ఫలితంగా ఈ కేసులో గత ఐదేళ్లుగా కొనసాగుతున్న స్టే ఉత్తర్వులు రద్దయ్యాయి.

సీబీఐ కోర్టు విచారణను నిలివేయాలని కోరుతూ 2016లో దాల్మియా పిటిషన్ దాఖలు చేయగా, విచారణను నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాతి నుంచి ఎప్పటికప్పుడు వీటిని పొడిగిస్తూ వస్తోంది. మరోవైపు, జగన్ అక్రమాస్తుల కేసుల్లోని పిటిషన్లపై వారం రోజులుగా విచారణ జరుగుతోంది.

ఈ క్రమంలో వాన్‌పిక్ కేసులో ముగ్గురు నిందితులు వేసిన పిటిషన్లతోపాటు, ప్రధాన నిందితుడు జగన్ దాఖలు చేసిన హాజరు మినహాయింపు పిటిషన్లపై వాదనలు ఇప్పటికే ముగియడంతో తీర్పును వాయిదా వేశారు. ఇప్పుడు దాల్మియా పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. మంగళవారం కూడా దీనిపై విచారణ జరగాల్సి ఉండగా, పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్టు దాల్మియా తరపు న్యాయవాది పీవీ కపూర్ తెలిపారు. చట్ట ప్రకారం తగిన పరిష్కారం కనుగొంటామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.


More Telugu News