కాంటాక్ట్ ట్రేసింగ్‌కు కరీనా కపూర్ కుటుంబం సహకరించడం లేదు: ముంబై అధికారుల ఆరోపణ

  • ఈ నెల 8న కరణ్ జొహార్ ఇంట్లో డిన్నర్‌కు కరీనా
  • ఆమె నివసిస్తున్న భవనాన్ని సీల్ చేసిన బీఎంసీ అధికారులు
  • సైఫ్ అలీఖాన్ ఎక్కడున్నారో చెప్పడం లేదంటున్న అధికారులు
  • సేకరించిన నమూనాలు జినోమ్ సీక్వెన్సింగ్‌కు
  •  నిబంధనలు ఉల్లంఘించలేదన్న కరీనా
కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం బాలీవుడ్ నటి కరీనా కపూర్ కుటుంబం సహకరించడం లేదని, సైఫ్ అలీఖాన్ ఎక్కడున్నారో చెప్పడం లేదని బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ఆరోపించారు. కరణ్ జొహార్ ఇంట్లో డిన్నర్‌కు వెళ్లిన కరీనా కపూర్, అమృతా అరోరా సోమవారం కరోనా బారినపడ్డారు. వీరిద్దరూ కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ముంబైలోని పలు పార్టీల్లో పాల్గొన్నట్టు ఆరోపించిన అధికారులు వీరివల్ల మరింతమందికి కరోనా వ్యాపించే అవకాశం ఉందని భావించారు.

ఈ నేపథ్యంలో కరీనా నివసించే భవనాన్ని సీల్ చేసిన అధికారులు అక్కడి వారికి పరీక్షలు నిర్వహించారు. అయితే, కాంటాక్ట్ ట్రేసింగ్ విషయంలో కరీనా కుటుంబ సభ్యులు సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీనా భర్త సైఫ్ అలీఖాన్ ఎక్కడున్నారన్న విషయాన్ని చెప్పడం లేదని, ఎన్నిసార్లు అడిగినా ముంబైలో లేరనే చెబుతున్నారని, ఎక్కడున్నారన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదని అన్నారు. ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోందని, సేకరించిన నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తామని చెప్పారు.

కరీనా కపూర్ నిబంధనలు ఉల్లంఘించారని వస్తున్న వార్తలపై ఆమె అధికార ప్రతినిధి స్పందించారు. ఆమె చాలా బాధ్యతాయుతమైన పౌరురాలని, లాక్‌డౌన్ సమయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించారని పేర్కొన్నారు. కరణ్ జొహార్ ఈ నెల 8న తన ఇంట్లో ఇచ్చిన పార్టీలో ఓ వ్యక్తి దగ్గుతూ కనిపించాడని, అతడు రాకుండా ఉండాల్సిందని అన్నారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే కరీనా క్వారంటైన్‌కు వెళ్లిపోయినట్టు చెప్పారు.


More Telugu News