ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య.. తిరుపతిలో దిగాల్సిన విమానం బెంగళూరుకు.. 4 గంటలుగా డోర్లు తీయట్లేదంటూ రోజా వీడియో

  • గంట పాటు తిరుపతిలో చక్కర్లు
  • అక్కడి నుంచి బెంగళూరుకు తీసుకెళ్లిన పైలట్లు
  • పెద్ద సమస్యే ఉండి ఉంటుందన్న ఎమ్మెల్యే
  • ప్రయాణికులు అరుస్తున్నారని వెల్లడి
  • తన పొట్టకు 29 కుట్లు పడ్డాయన్న రోజా
  • నొప్పి తట్టుకోలేకపోతున్నానని ఆవేదన
వైసీపీ ఎంపీ రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ల్యాండింగ్ చేస్తే ప్రమాదం జరిగే ముప్పుందని గ్రహించిన పైలట్.. విమానాన్ని కిందకు దించలేదు. రాజమండ్రి నుంచి 9.20 గంటలకు తిరుపతికి బయల్దేరిన ఇండిగో విమానం.. 10.20 గంటలకు తిరుపతిలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే, సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించి.. అక్కడ ల్యాండ్ చేశారు.

విమానాన్ని ల్యాండ్ చేసినా డోర్లు మాత్రం తెరవలేదు. దీంతో 4 గంటలుగా రోజా సహా ప్రయాణికులంతా విమానంలోనే చిక్కుకుపోయారు. ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు ప్రముఖులు విమానంలో ఉన్నారు. దీనికి సంబంధించి రోజా వీడియోను కూడా విడుదల చేశారు. డోర్లు కూడా తెరవడం లేదని, తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని బెంగళూరులో దింపారని ఆమె అందులో తెలిపారు. గ్రౌండ్ లో పరిస్థితేంటో తెలియదని చెప్పారు.

దీనిపై ఆమె ఫోన్ లో విలేకర్లతో మాట్లాడారు. నాలుగు గంటలుగా విమానంలోనే ఉండిపోయామని చెప్పారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసినా.. అక్కడ పర్మిషన్ ఉందో లేదో చెప్పట్లేదన్నారు. డోర్లు కూడా తెరవడం లేదని తెలిపారు. మబ్బులున్నాయని, కింద రన్ వే కనిపించడం లేదని ఫ్లైట్ లో అనౌన్స్ చేశారని, కానీ, అది సాంకేతిక సమస్యని బెంగళూరుకు వచ్చాకే తెలిసిందని ఆమె చెప్పారు. విమానంలో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకే బెంగళూరుకు వచ్చామని ఫ్లైట్ అధికారులు చెప్పారన్నారు.

విమానంలో ప్రయాణికులు భయపడిపోతున్నారని, అరుస్తున్నారని రోజా చెప్పారు. చంపేస్తారా? అంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను కిందకు దించేందుకు ఎయిర్ పోర్టు అధికారుల నుంచి ఇంకా తమకు ఆదేశాలు రాలేదని పైలట్లు చెబుతున్నారన్నారు. విమానంలో ఏదో పెద్ద సమస్యే వచ్చినట్టుందని ఆమె చెప్పారు. ట్రైన్లయినా, ఫ్లైట్స్ అయినా యాక్సిడెంట్లు అవుతాయన్న భయంతో ప్రయాణాన్ని ఆపుకోలేం కదా? అని అన్నారు. ఇలా అలవాటైపోయిందన్నారు.

తనకిలా జరగడం ఇది రెండోసారన్నారు. అంతకుముందు హైదరాబాద్ లో విమానం టైర్ పేలిపోయి రాత్రి 10.40 గంటల సమయంలో ఇలాగే డోర్లు క్లోజ్ చేసి పెట్టారని గుర్తు చేశారు. ఇటీవలే తనకు మేజర్ ఆపరేషన్ అయిందని, ఒకే చోట నాలుగు గంటలు తాను కూర్చోలేనంటూ పైలట్ తో మాట్లాడానని ఆమె తెలిపారు. తనతో పాటు లావణ్య అనే తన కజిన్ విమానంలో ఉన్నారని చెప్పారు. తన పొట్టకు 29 కుట్లు వేశారన్నారు. దాని వల్ల పొట్ట మీద భారం పడుతుందన్నారు.

చాలా నొప్పిగా, బాధగా ఉందని ఆమె పేర్కొన్నారు. మెడికల్ గ్రౌండ్ లో దింపుతామని, అయితే, దానిని చెక్ చేసేందుకు సంబంధిత అధికారులు రావాల్సి ఉందని ఫ్లైట్ అటెండెంట్ చెప్పారని తెలిపారు. అయితే, విమానాన్ని ఎక్కడికి తీసుకెళ్తారన్న దానిపై స్పష్టత లేదని, వెనక్కు తీసుకెళ్తారా? వేరే విమానం అరెంజ్ చేస్తారా? అన్నది చెప్పట్లేదని తెలిపారు.  


More Telugu News