వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై మోదీ ఫొటోను చూసి మీరెందుకు సిగ్గుపడుతున్నారు?: పిటిషనర్ ను ప్రశ్నించిన కేరళ హైకోర్టు

  • కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై మోదీ ఫొటో
  • ఇది ఒక వ్యక్తి ప్రైవేట్ స్పేస్ లోకి రావడమేనని పిటిషన్
  • దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రధాని ఫొటో ఉంటే తప్పేంటన్న హైకోర్టు
కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో ఉండటాన్ని కొందరు తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. ఫొటోను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు ఈ విషయమై కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారు. కేరళ హైకోర్టులో కూడా ఇలాంటి పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పిటిషనర్ ను ఉద్దేశించి జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సర్టిఫికెట్ పై మోదీ ఫొటో ను చూసి మీరు సిగ్గుపడుతున్నారా? అని జస్టిస్ కున్హికృష్ణన్ ప్రశ్నించారు. మన దేశ ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి ప్రధాని అని, ప్రజా తీర్పుతో ఆయన ప్రధాని అయ్యారని.. సర్టిఫికెట్ పై ఆయన ఫొటో ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. మన మధ్య రాజకీయపరమైన విభేదాలు ఉండొచ్చని... కానీ, ఆయన దేశ ప్రధాని అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు.

ఈ పిటిషన్ ను పీటర్ మయాలీపరంపిల్ అనే వ్యక్తి దాఖలు చేశారు. సర్టిఫికెట్ అనేది వ్యక్తిగతమైనదని... దాంట్లో వ్యక్తిగత విషయాలు ఉంటాయని పిటిషన్ లో పేర్కొన్నారు. అలాంటి సర్టిఫికెట్ పై ప్రధాని ఫొటోను ముద్రించడమనేది ఒక వ్యక్తి ప్రైవేట్ స్పేస్ లోకి రావడమేనని చెప్పారు.

 దీనిపై హైకోర్టు స్పందిస్తూ సర్టిఫికెట్ పై ప్రధాని ఫొటో ఉండటాన్ని దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలు ప్రశ్నించడం లేదని... మీరు మాత్రమే అభ్యంతరం ఎందుకు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించింది. ఈ పిటిషన్ లో మెరిట్స్ ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని చూస్తామని... మెరిట్స్ లేకపోతే పిటిషన్ ను కొట్టేస్తామని స్పష్టం చేసింది.


More Telugu News