పీఆర్సీపై కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

  • చర్చలకు ఆహ్వానించిన సర్కారు
  • మొత్తం 71 డిమాండ్లపైనా చర్చించాల్సిందేనన్న ఉద్యోగ సంఘాలు
  • ప్రస్తుతానికి పీఆర్సీపై చర్చిద్దామన్న ప్రభుత్వం
  • సజ్జల రామకృష్ణా రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం
వేతన సవరణ అంశాలపై చర్చించేందుకు రావాల్సిందిగా ఉద్యోగ సంఘాలను ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. దీంతో కాసేపట్లో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం కానున్నారు. ఇప్పటికే పీఆర్సీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.

కమిటీ రిపోర్ట్ లో పేర్కొన్న 14.29 శాతం ఫిట్ మెంట్, వచ్చే ఏడాది నగదు చెల్లింపులు, హెచ్ ఆర్ఏ తగ్గింపు తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. అయితే, కేవలం వీటిపైనే చర్చించేందుకు తాము సిద్ధంగా లేమని, తమ మొత్తం 71 డిమాండ్లపైనా చర్చించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతానికి పీఆర్సీపై చర్చలకు రావాలన్న ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఉద్యోగులు చర్చకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.


More Telugu News