2019 వరల్డ్ కప్ సెలెక్షన్ పై రవిశాస్త్రి వ్యాఖ్యలతో ఏకీభవించిన మాజీ సెలెక్టర్

  • టీమ్ సెలెక్షన్ లో హెడ్ కోచ్ పాత్ర ఉండదన్న రవిశాస్త్రి
  • రవిశాస్త్రి చెప్పింది నిజమేనన్న శరణ్ దీప్ సింగ్
  • మిడిల్ ఆర్డర్ లో భారీ షాట్లు ఆడే బ్యాట్స్ మెన్ కావాలనే పంత్ ను ఎంపిక చేశామన్న సింగ్ 
2019 వన్డే ప్రపంచకప్ సెలెక్షన్ పై అప్పటి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలతో మాజీ ఇండియన్ సెలెక్టర్ శరణ్ దీప్ సింగ్ ఏకీభవించారు. ప్రపంచకప్ కు ముగ్గురు వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ధోనీ, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ సమయంలో మంచి ఫామ్ లో ఉన్న అంబటి రాయుడిని పక్కన పెట్టేశారు.

దీనిపై రవిశాస్త్రి మాట్లాడుతూ... అంబటి రాయుడిని పక్కన పెట్టిన విషయంలో ఏమీ మాట్లాడలేనని చెప్పారు. రాయుడిని తీసుకుని ఉంటే బాగుండేదని... అయితే సెలెక్షన్ ప్రక్రియలో హెడ్ కోచ్ పాత్ర ఏమీ ఉండదని అన్నారు.

రవిశాస్త్రి వ్యాఖ్యలపై శరణ్ దీప్ సింగ్ స్పందిస్తూ... జట్టు ఎంపికలో హెడ్ కోచ్ పాత్ర ఉండదని చెప్పారు. అయితే, సెలెక్షన్ కమిటీ గ్రౌండ్ కు వెళ్లి కెప్టెన్, హెడ్ కోచ్ తో మాట్లాడుతుందనీ, తమ వ్యూహాలపై చర్చిస్తుందనీ అన్నారు. ఎవరైనా ఒక ప్లేయర్ కావాలనుకుంటే సెలెక్షన్ కమిటీకి హెడ్ కోచ్ సూచించవచ్చనీ చెప్పారు. గత కొన్నేళ్లుగా దాదాపు అన్ని ద్వైపాక్షిక సిరీస్ లను మనం గెలిచామని తెలిపారు.

తనకు ఏ ప్లేయర్ కావాలనే విషయాన్ని కెప్టెన్ కు హెడ్ కోచ్ చెప్పాలని సింగ్ తెలిపారు. తనకు ఏం కావాలో కోహ్లీకి రవిశాస్త్రి చెప్పొచ్చని అన్నారు. కొన్నిసార్లు ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవచ్చని... అయితే చివరకు అందరి లక్ష్యం, ఆలోచన ఒకటేనని చెప్పారు. రవిశాస్త్రి చాలా మంచి కోచ్ అని... ఆయనతో తమకు ఎప్పుడూ విభేదాలు రాలేదని అన్నారు. ఎవరు ఏది చెప్పినా వినే గుణం శాస్త్రిలో ఉందని కితాబునిచ్చారు. ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే అందరం కూర్చొని మాట్లాడుకునేవాళ్లమని చెప్పారు.

ప్రపంచకప్ కు ఎంపిక చేసిన ముగ్గురు వికెట్ కీపర్లు కూడా మంచి బ్యాట్స్ మెన్ అని సింగ్ తెలిపారు. 11 మంది ఆటగాళ్ల తుది జట్టు ఎంపికలో సెలెక్టర్ల పాత్ర ఉండదని... అది టీమ్ మేనేజ్ మెంట్ బాధ్యత అని చెప్పారు. వరల్డ్ కప్ లో శిఖర్ ధావన్ గాయపడిన తర్వాత అతని స్థానంలో రిషభ్ పంత్ ను తీసుకున్నారని... అప్పటికే ఒక ఓపెనర్ గా కేఎల్ రాహుల్ ఉన్నాడని... అందువల్ల మిడిల్ ఆర్డర్ లో వచ్చి, భారీ షాట్లు ఆడే బ్యాట్స్ మెన్ కోసం తాము ఆలోచించామని తెలిపారు. ఈ కారణం వల్లే పంత్ తుది జట్టులోకి వచ్చాడని చెప్పారు.


More Telugu News