ఇక వణుకు తప్పదు.. తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

  • ఈశాన్య, వాయవ్య భారత్ నుంచి తెలంగాణ వైపు గాలులు
  • మరో ఐదు రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం
  • సాధారణం కంటే 25 శాతం పెరిగిన తేమ శాతం
వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో చలి మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయని, ఫలితంగా చలి పెరుగుతోందని పేర్కొంది. ఈశాన్య, వాయవ్య భారత్ నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణవైపు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతోందని అధికారులు తెలిపారు. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలో పగటి వేళ పొడి వాతావరణం ఉంటుందని, రాత్రివేళ భూవాతావరణం త్వరగా చల్లబడం వల్ల చలి పెరుగుతుందని పేర్కొన్నారు.

ఉదయం పూట పొగమంచు కురుస్తోందని, గాలిలో తేమ సాధారణం కంటే 25 శాతం అదనంగా పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఇక, నిన్న తెల్లవారుజామున కుమురంభీం జిల్లాలోని సిర్పూర్‌లో అత్యల్పంగా 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజులపాటు ఇది 10 డిగ్రీలలోపే ఉంటుందని నాగరత్న తెలిపారు.


More Telugu News