'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు

  • నిన్న హైదరాబాదులో 'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • 50 వేల పాస్ లకు పోలీసుల అనుమతి
  • అంతకంటే ఎక్కువ పాస్ లు జారీ చేసినట్టు వెల్లడి
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'పుష్ప' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో నిర్వహించారు. అయితే, యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అనుమతులకు మించి పాస్ లు జారీ చేశారని పోలీసులు గుర్తించారు.

తాము అనుమతి ఇచ్చింది 5 వేల పాస్ లకు మాత్రమేనని, కానీ ఈవెంట్ నిర్వాహకులు అంతకంటే ఎక్కువ సంఖ్యలో పాస్ లు జారీ చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ శ్రేయాస్ మీడియా పైనా, కార్యక్రమ ఆర్గనైజర్ కిశోర్ అనే వ్యక్తిపైనా పలు సెక్షన్లు మోపారు.

'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం సందర్భంగా నిన్న సాయంత్రం యూసఫ్ గూడ పరిసరాల్లో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోడ్లన్నీ క్రిక్కిరిసిపోయాయి. అల్లు అర్జున్ అభిమానులు ఉదయం నుంచే యూసఫ్ గూడకు పోటెత్తారు. ఈ నేపథ్యంలో, ఎంతమంది ఈ కార్యక్రమానికి వచ్చారని పోలీసులు ఆరా తీయడంతో, అనుమతికి మించి పాస్ లు జారీ చేసినట్టు తెలిసింది.


More Telugu News