కాళేశ్వరం ముంపు ప్రభావంపై అధ్యయనం... కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు మానవ హక్కుల సంఘం నోటీసులు
- కాళేశ్వరంతో ముంపు ప్రమాదం ఉందంటూ ఫిర్యాదు
- 40 వేల ఎకరాల పంట నష్టం జరిగిందని ఆరోపణ
- ఫిర్యాదును పరిశీలించిన ఎన్ హెచ్ఆర్సీ
- 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
తెలంగాణ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపు ప్రభావం అధికంగా ఉంటోందని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు అందింది. ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ కారణంగా 40 వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని, పంట నష్టం వల్ల ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్ హెచ్ఆర్సీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ముంపు ప్రభావంపై అధ్యయనం చేపట్టాలని ఆదేశించింది. 8 వారాల్లో అధ్యయనం తాలూకు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.