నేడు తమిళనాడుకు కేసీఆర్.. రేపు స్టాలిన్ తో భేటీ!

  • కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో తిరుచ్చికి
  • శ్రీ రంగనాథస్వామి ఆలయ సందర్శన
  • స్టాలిన్‌తో భేటీలో బీజేపీ వ్యతిరేక కూటమిపై చర్చించే అవకాశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కుటుంబంతో కలిసి తమిళనాడు పర్యటనకు వెళ్తున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో తిరుచ్చి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం చెన్నై చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో భేటీ అవుతారని సమాచారం.

యాసంగిలో దొడ్డు బియ్యం సేకరణ విషయంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇదే విషయమై టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో నిరసనలు కూడా తెలిపి సమావేశాలను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో బియ్యం సేకరణతోపాటు ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడం, పంటలకు మద్దతు ధరలపై విధాన నిర్ణయన్ని వెల్లడించేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇతర రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన స్టాలిన్‌తో సమావేశం అవుతున్నట్టు తెలుస్తోంది. అలాగే, బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుపైనా చర్చించే అవకాశం ఉందని సమాచారం.


More Telugu News