వన్డే, టీ20లకు టాటా చెప్పేయ‌నున్న విరాట్ కోహ్లీ?

  • కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ
  • కోహ్లీ ఆగ్ర‌హంతో ఉన్నాడ‌ని ప్ర‌చారం
  • స‌మీప భ‌విష్య‌త్తులోనే కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్న కోహ్లీ?
  • కేవ‌లం టెస్టుల్లోనే కొన‌సాగే అవ‌కాశం
విరాట్ కోహ్లీని టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు, ఆయ‌న గురించి మ‌రో ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. త్వరలోనే కోహ్లీ వన్డే, టీ20ల నుంచి నిష్క్ర‌మించ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. స‌మీప భ‌విష్య‌త్తులోనే దీనిపై కోహ్లీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లోనూ కోహ్లీ వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్‌ శర్మకు అప్పగించిన విష‌యం తెలిసిందే. ఈ నిర్ణ‌యం కోహ్లీకి నచ్చలేద‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేగాక‌, గంగూలీ కూడా ఇటీవ‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

వ‌న్డే, టీ20లకు ఇద్దరు కెప్టెన్లు కొనసాగే అవకాశం లేదని చెప్పాడు. దీంతో కోహ్లీ వన్డే, టీ20లకు గుడ్ బై చెప్పేస్తాడ‌న్న ప్ర‌చారానికి మ‌రింత‌ బ‌లం చేకూరింది. త‌న‌ను వ‌న్డే కెప్టెన్సీ నుంచి త‌ప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం కోహ్లీకి న‌చ్చ‌క‌పోవ‌డంతోనే దీనిపై ఆయ‌న‌ మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది.

దీంతో వ‌న్డే, టీ20ల నుంచి నిష్క్ర‌మించి టెస్ట్ క్రికెట్‌లో మాత్రమే కొనసాగాలనే ఆలోచనలో కోహ్లీ ఉన్న‌ట్లు స‌మాచారం. కెప్టెన్సీని కోల్పోయిన కోహ్లీ ఒక‌వేళ‌ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో రాణించ‌లేక‌పోతే టీమిండియాలో ఆయ‌న‌కు అవ‌కాశం ఉండ‌ద‌నే వాద‌న‌లు విన‌ప‌డుతున్నాయి.

అంతేగాక‌, రోహిత్ శ‌ర్మ‌ కెప్టెన్సీలో కోహ్లీకి మద్దతు ఉంటుందా? అనే విష‌యం కూడా ఆస‌క్తి రేపుతోంది. అదే జ‌రిగి టీమిండియాలో కోహ్లీ చోటు కోల్పోతే వన్డే, టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. బిజీ షెడ్యూల్ కారణంగా ఇప్ప‌టికే టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ ఇప్ప‌టికే తప్పుకున్నాడు.

ఆర్సీబీ కెప్టెన్సీని వద్ద‌నుకున్నాడు. అయితే, 2023 వన్డే ప్రపంచకప్ లో టీమిండియాను గెలిపించి అనంత‌రం గౌరవంగా కెప్టెన్సీని వ‌దులుకోవాల‌ని భావించాడు. అయితే, కోహ్లీ కెప్టెన్సీపై నమ్మకం లేకపోవ‌డంతో ఆయ‌న‌ను బీసీసీఐ ఇటీవ‌లే ఆ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించింది. దీంతో కోహ్లీ ఆగ్ర‌హంతో ఉన్నట్లు తెలుస్తోంది.


More Telugu News