వెంటాడుతున్న ఒమిక్రాన్ భయం.. క్రమంగా ఆంక్షల వలయంలోకి దేశాలు

  • మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేసే యోచనలో అమెరికా
  • న్యూయార్క్‌లో దారుణంగా పెరిగిపోతున్న కేసులు
  • ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులు బాటు కల్పించాలన్న బ్రిటన్ ప్రధాని
  • అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు పొడిగించిన ఇజ్రాయెల్
  • దక్షిణ కొరియాలో రోజుకు 7వేలకు పైగా కేసులు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ వేరియంట్‌కు అడ్డుకట్ట వేసేందుకు చాలా వరకు దేశాలు ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాలోని న్యూయార్క్‌లో ఒమిక్రాన్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేయాలని యోచిస్తున్నట్టు న్యూయార్క్ గవర్నర్ కాథి హోచుల్ తెలిపారు.

కరోనా తొలి దశలో మాస్కుల వాడకాన్ని తప్పనిసరి చేసిన అమెరికా ప్రభుత్వం ఆ తర్వాత కొంత సడలించింది. టీకా తీసుకున్న వారు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇప్పుడు ఒమిక్రాన్ భయం వెంటాడుతుండడంతో మళ్లీ అందరికీ మాస్కులు తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. అయితే, కేసులు, ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్యను బట్టి నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ తెలిపారు.

బ్రిటన్ ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించింది. స్వయంగా అధికారులే ఆంక్షలను ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలపై ప్రధాని బోరిస్ జాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండోర్ ప్రాంతాల్లో మాస్కులను తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటించారు. వీలైతే ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాలని సూచించారు. విదేశీయులు దేశంలో అడుగుపెట్టకుండా ఆంక్షలు విధించిన ఇజ్రాయెల్.. తాజాగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను మరో 10 రోజులపాటు పొడిగించింది. ఇజ్రాయెల్ బెన్-గురియాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులపై ఈ నెల 22 వరకు ఆంక్షలు ఉంటాయని తెలిపింది.

మరోవైపు, దక్షిణ కొరియాలో రోజుకు 7 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న మూడో రోజు వరుసగా 7వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేసులు దారుణంగా పెరుగుతున్నప్పటికీ ఆంక్షల మాటెత్తకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కరోనా మహమ్మారి అదుపులోకి రాకుంటే కఠిన చర్యలకు తీసుకునేందుకు రెడీగా ఉన్నట్టు ప్రధాని కిమ్ బూ క్యూమ్ తెలిపారు. మరోవైపు, భారత్ కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉంది. జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలను హెచ్చరించింది.


More Telugu News