మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు... అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం లేఖ

  • 27 జిల్లాల్లో పెరుగుతున్న కొత్త కేసులు
  • 19 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం పాజిటివిటీ రేటు
  • 8 జిల్లాల్లో 10 శాతం మించి పాజిటివిటీ రేటు
  • నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్న కేంద్రం
గతంలో సెకండ్ వేవ్ కు ముందు నాటి పరిస్థితులే దేశంలో ఇప్పుడు మరోసారి కనిపిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో, 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 27 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు పెరిగిపోతుండడం పట్ల కేంద్రం స్పందించింది. గత రెండు వారాలుగా ఆయా ప్రాంతాల్లో కొత్త కేసుల సంఖ్య అధికంగా నమోదవుతోందని తెలిపింది. కరోనా వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. కరోనా మార్గదర్శకాల అమలుపై నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేసింది.

కేరళ, మిజోరం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, మణిపూర్, నాగాలాండ్ లోని 19 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్య పాజిటివిటీ రేటు ఉందని వెల్లడించింది. మూడు రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో 10 శాతం కంటే అధికంగా పాజిటివిటీ రేటు నమోదవుతోందని వివరించింది. మొత్తమ్మీద 27 జిల్లాల్లో కేసుల సరళిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఒమిక్రాన్ కేసులు దేశంలో హెచ్చుతుండడంతో కొత్త వేరియంట్ మరో విపత్తు కాగలదన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇలాగే డెల్టా వేరియంట్ దేశంలో అత్యధిక ప్రాణనష్టానికి దారితీసింది.


More Telugu News