బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం: హర్యానా సీఎం ఖట్టర్ హెచ్చరిక

  • ప్రార్థనలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది
  • ప్రార్థనలు రోడ్డు ట్రాఫిక్ ను అడ్డుకునేలా ఉండకూడదు
  • సామరస్య పూర్వకమైన పరిష్కారాన్ని రూపొందిస్తామన్న సీఎం  
గురుగావ్ లో బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు చేయరాదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హెచ్చరించారు. హిందూ, ముస్లిం వర్గీయుల మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో 2018లో ఓ ఒప్పందం జరిగింది. బహిరంగ ప్రదేశాలలో నిర్దేశిత ప్రాంతాల్లో ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని ప్రభుత్వ యంత్రాంగం అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.  

బహిరంగ ప్రదేశాలలో ముస్లింలు మళ్లీ ప్రార్థనలు చేస్తున్న తరుణంలో హిందూ సమాజంలోని ఒక వర్గం వారితో ఘర్షణకు దిగుతోంది. ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. అన్ని పక్షాలతో మళ్లీ చర్చలు జరుపుతామని.. సామరస్య పూర్వకమైన పరిష్కారాన్ని రూపొందిస్తామని ఖట్టర్ తెలిపారు. అప్పటి వరకు ప్రజలంతా తమతమ ఇళ్లలో లేదా నిర్దేశిత ప్రార్థనా స్థలాల్లోనే ప్రార్థనలు చేయాలని కోరారు.

ప్రార్థనా స్థలాల్లో ప్రార్థనలు చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని... ప్రార్థనల కోసమే ఆ స్థలాలను నిర్మించారని ఖట్టర్ చెప్పారు. అయితే బహిరంగంగా ఆ పనులు చేయకూడదని... బహిరంగంగా నమాజ్ చేసే ఆచారాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని అన్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పోలీసు అధికారులతో మాట్లాడానని చెప్పారు.

ప్రతి ఒక్కరికి ప్రార్థనలు చేసే హక్కు ఉంటుందని... అయితే వారి ప్రార్థనలు రోడ్డు ట్రాఫిక్ ను అడ్డుకునేలా ఉండకూడదని ఖట్టర్ చెప్పారు. ఆక్రమణల్లో ఉన్న వక్ఫ్ భూములను, స్థలాలను ఉచితంగా అందించేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని ఖట్టర్ తెలిపారు.


More Telugu News