న్యాయపోరాటంలో నెగ్గిన జయలలిత మేనకోడలు.. వేద నిలయాన్ని దీపకు అప్పగించిన కోర్టు

  • దీపకు వేద నిలయం తాళాలు అందించిన చెన్నై కలెక్టర్
  • భర్త మాధవన్‌, శ్రేయోభిలాషులతో కలిసి ఇంట్లోకి వెళ్లిన దీప
  • జయలలిత చిత్ర పటానికి నివాళులు
  • అత్తయ్యతో ఇక్కడ గడిపిన జ్ఞాపకాలు మదిలో సుడులు తిరుగుతున్నాయంటూ భావోద్వేగం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలితకు అసలైన వారసురాలిని తానేనని, ఆమె నివాసమైన పొయెస్ గార్డెన్‌లోని వేద నిలయం తనకే దక్కాలంటూ కోర్టుకెక్కిన జయలలిత అన్న కుమార్తెకు దీప విజయం సాధించారు. వేద నిలయాన్ని దీపకు అందించాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో చెన్నై కలెక్టర్ విజయరాణి నిన్న దీప చేతికి వేద నిలయం తాళాలు అందించారు. జయలలిత మరణం తర్వాత ఆమె నివాసం ప్రభుత్వం పరమైంది.

వేద నిలయాన్ని ప్రభుత్వ పరం చేయడాన్ని సవాలు చేస్తూ జయలలిత అన్న కుమారుడు, కుమార్తె అయిన దీపక్, దీపలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం మెరీనా బీచ్‌లో ఇప్పటికే జయలలిత స్మారక మందిరం ఉందని, ఇప్పుడు రెండోది ఎందుకని ప్రశ్నించింది. వేద నిలయాన్ని స్వాధీనం చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. దానిని ఆమె వారసురాలైన దీపకు అందించాలని ఆదేశించింది.

కోర్టు తీర్పుపై దీప సంతోషం వ్యక్తం చేశారు. ‘‘ఇది చాలా పెద్ద విజయం. దీనిని సాధారణంగా పరిగణించకూడదు. మా అత్తయ్య మరణం తర్వాత తొలిసారి ఆ ఇంట్లోకి అడుగుపెడుతున్నందుకు చాలా భావోద్వేగానికి లోనయ్యాను’’ అని దీప పేర్కొన్నారు.

భర్త మాధవన్‌, శ్రేయోభిలాషులతో కలిసి ఇంట్లో అడుగుపెట్టిన దీప జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.‘‘ఇది నా పుట్టిన స్థలం. అత్తయ్యతో కలిసి గడిపిన జ్ఞాపకాలు మనసులో సుడులు తిరుగుతున్నాయి’’ అని పేర్కొన్న దీప.. ఇకపై ఇది రాజకీయాలకు వేదిక కాబోదని స్పష్టం చేశారు.


More Telugu News