ఊహాగానాలను ఆపండి.. వాస్తవాలను బయటపెడతాం.. సీడీఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై ఐఏఎఫ్

  • త్రివిధ దళాల విచారణ సాగుతోందని వెల్లడి
  • ప్రమాద కారణాలను విశ్లేషిస్తున్నామని కామెంట్
  • త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయన్న ఐఏఎఫ్
  • అప్పటిదాకా చనిపోయినవారి గౌరవమర్యాదలు కాపాడాలని సూచన
సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) స్పందించింది. దర్యాప్తు యుద్ధప్రాతిపదికన సాగుతోందని, అనవసర ఊహాగానాలు వద్దని సూచించింది. ‘‘ప్రమాదంపై ట్రై సర్వీస్ (త్రివిధ దళాల) కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ప్రారంభించాం. మొన్న (డిసెంబర్ 8) జరిగిన హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నాం. దర్యాప్తును వేగంగా చేస్తున్నాం. త్వరితగతిన విచారణ పూర్తి చేస్తాం. త్వరలోనే అన్ని వాస్తవాలను బయటపెడతాం. అప్పటిదాకా చనిపోయిన వారి గౌరవమర్యాదలను కాపాడండి. అనవసర ఊహాగానాలను ఆపేయండి’’ అంటూ ఐఏఎఫ్ ట్వీట్ చేసింది.

కాగా, త్రివిధ దళాల విచారణకు ఆదేశించినట్టు నిన్న పార్లమెంట్ లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోపక్క, ఇవాళ సాయంత్రం ఢిల్లీలో సైనిక లాంఛనాలతో సీడీఎస్ రావత్ కు అంత్యక్రియలను నిర్వహించనున్నారు. హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు ఢిల్లీలోని సీడీఎస్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.


More Telugu News