2011 వరల్డ్ కప్ లో చోటు దక్కకపోవడంపై పదేళ్ల క్రితం రోహిత్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్!

  • చోటు దక్కకపోవడం బాధించిందంటూ ట్వీట్
  • అది తనకు పెద్ద ఎదురుదెబ్బేనంటూ విచారం
  • ఆ ట్వీట్ ను గుర్తు చేసుకుంటున్న అభిమానులు
టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మ ఇప్పటికే నిరూపించేసుకున్నాడు. సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనిపించుకున్నాడు. ఇప్పుడు వన్డే కెప్టెన్సీనీ అతడికే ఇచ్చేశారు. అనూహ్యంగా కోహ్లీని తప్పించేసి రోహిత్ కు జట్టు పగ్గాలందించారు. అయితే, అవన్నీ ఎలా ఉన్నా.. పదేళ్ల క్రితం రోహిత్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

2011 వరల్డ్ కప్ కోసం జట్టులో అతడికి చోటు దక్కలేదు. హిట్ మ్యాన్ ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. దానిపై అప్పట్లోనే రోహిత్ ట్వీట్ చేశాడు. ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన టీంలో నేను లేకపోవడం బాధించింది. అయినా ఇక నుంచి నేను ముందుకే వెళ్లాలి. ఏదేమైనా ఎంపిక కాకపోవడం అతిపెద్ద ఎదురుదెబ్బే. మీరేమంటారు?’’ అంటూ 2011 జనవరి 31న రోహిత్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ను ఇప్పుడు రోహిత్ అభిమానులు గుర్తుచేసుకుంటూ రీట్వీట్ చేస్తున్నారు. ఆ ఏడాది వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా.. 2015, 2019 వరల్డ్ కప్ లలో విఫలమైంది.

ఈ నేపథ్యంలోనే 2023లో భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్ కోసం భారత్ సన్నద్ధమవుతోంది. ఇటు 2022లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసమూ రెడీ అవుతోంది. ఈ క్రమంలో రెండు వరల్డ్ కప్ లను సాధించే దిశగా జట్టులో బీసీసీఐ మార్పులు చేసింది. అందులో భాగంగానే జట్టులో సమన్వయం కోల్పోకూడదన్న ఉద్దేశంతోనే వన్డే కెప్టెన్సీని కూడా రోహిత్ కే అప్పగించింది. ఇందులో భాగంగా రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనలో రోహిత్ వన్డేలకు రెగ్యులర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.


More Telugu News