తెలంగాణ‌లో కొన‌సాగుతోన్న‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. 5 జిల్లాల్లో కఠిన ఆంక్షలు

  • 6 స్థానాల‌కు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు
  • ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
  • పోటీలో 26 మంది అభ్యర్థులు
  • ఈ నెల 14న ఎన్నికల ఫలితాల వెల్ల‌డి  
తెలంగాణ‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లు కొన‌సాగుతున్నాయి. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు  ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభ‌మైన పోలింగ్ ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు జ‌ర‌గ‌నుంది. 26 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలు జరుగుతోన్న‌ ఐదు జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

ఇటీవ‌లే  12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌‌  జారీ అయిన విష‌‌యం తెలిసిందే. అయితే, వాటిలో రంగారెడ్డి, మహబూబ్‌‌ నగర్‌‌ జిల్లాల్లో రెండేసి ఎమ్మెల్సీ స్థానాల‌ చొప్పున, అలాగే, నిజామాబాద్‌‌, వరంగల్‌లో ఒక్కో సీటు చొప్పున ఏకగ్రీవమయ్యాయి. దీంతో నేడు కరీంనగర్‌‌ జిల్లాలో రెండు, ఆదిలాబాద్‌‌, మెదక్‌‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో సీటుకు ఎన్నికలు కొనసాగుతున్నాయి.

కరీంనగర్ లో రెండు సీట్లకు పది మంది అభ్య‌ర్థులు పోటీలో ఉండ‌గా, నల్ల‌గొండలోని ఓ ఎమ్మెల్సీ స్థానానికి ఏడుగురు, ఆదిలాబాద్‌‌లో ఇద్దరు, ఖమ్మంలో నలుగురు, మెదక్‌‌లో ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీటి ఫ‌లితాలు ఈ నెల 14న వెల్ల‌డి కానున్నాయి. అభ్యర్థుల పేర్లతో కూడిన బ్యాలెట్‌‌ పేపర్‌‌లు ప్రింట్‌‌ చేశారు.

నిర్మల్ జిల్లా పరిషత్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో తెలంగాణ‌ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.  భైంసాలోనూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇత‌ర జిల్లాల్లోనూ పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది.


More Telugu News