బిపిన్ రావత్ హెలికాప్టర్ కూలడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి: శివసేన కీలక నేత సంజయ్ రౌత్

  • చైనా, పాకిస్థాన్ లను ఆర్మీ పరంగా ఎదుర్కోవడంలో రావత్ కీలకపాత్ర పోషించారు
  • ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదం జరగడం అనుమానాలను రేకెత్తిస్తోంది
  • అనుమానాలను మోదీ, రాజ్ నాథ్ నివృత్తి చేయాలి
భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఆయన భార్య, మరో 11 మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై శివసేన కీలక నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హెలికాప్టర్ క్రాష్ కావడం వల్ల సీడీఎస్ బిపిన్ రావత్ మృతి చెందడంపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని సంజయ్ రౌత్ అన్నారు. ఇటీవలి కాలంలో చైనా, పాకిస్థాన్ లను మిలిటరీ పరంగా ఎదుర్కోవడంలో బిపిన్ రావత్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధమైన ప్రమాదం జరగడం... సహజంగానే అందరిలో పలు అనుమానాలను రేకెత్తిస్తుందని అన్నారు. హెలికాప్టర్ అత్యాధునికమైనదని, రెండు ఇంజిన్లు ఉన్నాయని ఆయన అన్నారు.

సాయుధ బలగాలను ఆధునికీకరించుకున్నామని మనం చెప్పుకుంటున్నామని... అలాంటప్పుడు ఇలాంటి దుర్ఘటన ఎలా సంభవించిందని ప్రశ్నించారు. ఈ ప్రమాదంతో యావత్ దేశం, నాయకత్వం అయోమయంలో పడిపోయాయని... ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్ని అనుమానాలను నివృత్తి చేయాలని సంజయ్ రౌత్ కోరారు.


More Telugu News