ఆదాయం తగ్గిన నేపథ్యంలో... యాదాద్రి దేవాలయంలో పూజలు, ప్రసాదాల ధరల పెంపు.. నేటి నుంచే అమలు!

  • వీవీఐపీల కోసం ప్రత్యేకంగా సత్యనారాయణస్వామి వ్రతం
  • శాశ్వత పూజలు, వాహన పూజలు సహా అన్నింటి ధరలను పెంచేసిన వైనం
  • అనుబంధ ఆలయాలకూ కొత్త ధరలు వర్తిస్తాయన్న ఈవో
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి భక్తులకు ఇది కొంత షాకింగ్ వార్తే. కరోనా కారణంగా ఆదాయం తగ్గి ఆర్థిక భారంతో సతమతమవుతున్న ఆలయ అధికారులు పూజలు, ప్రసాదాల ధరలను పెంచేశారు. అంతేకాదు, పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. పెంచిన ధరలు అనుబంధ ఆలయాలకూ వర్తిస్తాయని ఆలయ కార్యనిర్వహణాధికారి గీత తెలిపారు. కరోనా కారణంగా ఆదాయం తగ్గి సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లించేందుకు కష్టమవుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

ఈ క్రమంలో రూ. 500గా ఉన్న  నిజాభిషేకం (ఇద్దరికి) టికెట్ ధరను రూ. 800కు పెంచారు. సుదర్శన హోమం ధరను రూ. 1,116 నుంచి రూ. 1250కి, సువర్ణ పుష్పార్చనను రూ. 516 నుంచి రూ. 600కు, 100 గ్రాముల లడ్డూ ధరను రూ. 20 నుంచి రూ. 30కి, అరకేజీ లడ్డూ ధరను రూ. 100 నుంచి రూ. 150కి పెంచగా, 150 గ్రాముల పులిహోర ప్యాకెట్ ధరను రూ. 20కి, 250 గ్రాముల వడ ధరను రూ. 20కి పెంచారు.

ఇంకా వీటితోపాటు వాహన పూజ, అక్షరాభ్యాసం, ఉపనయనం, అన్నప్రాశన, శాశ్వత పూజలు వంటి వాటి ధరలను కూడా భారీగా పెంచారు. అలాగే, వీవీఐపీలు సత్యనారాయణస్వామి వ్రతాన్ని ప్రత్యేకంగా జరుపుకునేందుకు కొత్తగా అవకాశం కల్పించారు. ఈ టికెట్ ధరను రూ. 1,500గా నిర్ణయించారు.


More Telugu News