నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు

  • నెల్లూరు జిల్లాలో వాగులో పడిన ఆటో
  • ఐదుగురి గల్లంతు, బాలిక మృతి
  • విజయనగరం జిల్లాలో ట్రాక్టర్ బోల్తా
  • 22 మందికి తీవ్ర గాయాలు, ఆరుగురి పరిస్థితి విషమం
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఓ బాలిక మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు జ్యోతినగర్‌కు చెందిన కె. నాగభూషణం కుటుంబ సభ్యులు సంగంలోని సంగమేశ్వరాలయంలో నిద్ర చేసేందుకు ఆటోలో బయలుదేరారు. బీరాపేరు వాగు వంతెనపైకి ఆటో చేరుకున్న సమయంలో ఎదురుగా వచ్చిన రెండు లారీలు ఒకదాన్నొకటి ఓవర్ టేక్ చేసే క్రమంలో ఓ లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో అది కిందనున్న వాగులోకి పడిపోయింది. ఆ సమయంలో అటుగా వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురు గల్లంతు కాగా, ముగ్గురు ఈదుకుంటూ బయటకు వచ్చారు. మిగిలిన నలుగురిని స్థానికులు రక్షించారు. వీరిలో 14 ఏళ్ల నాగవల్లి అనే బాలిక మృతి చెందింది. కాగా, బాధితులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామలవలస వద్ద జరిగిన మరో ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. చింతాడవలసకు చెందిన 35 మంది ట్రాక్టర్‌లో కిండాం అగ్రహారంలో జరిగిన వివాహానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చామలవలస వద్ద వీరి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది తీవ్రంగా గాయపడ్డారని, వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.


More Telugu News