రోడ్డు పక్కన అనాథగా.. తమిళ సీనియర్ సినీ దర్శకుడి మృతదేహం!

  • రోడ్డు పక్కన ప్రాణాలు విడిచిన తమిళ దర్శకుడు త్యాగరాజన్
  • విజయకాంత్, ప్రభు సినిమాలకు దర్శకత్వం వహించిన త్యాగరాజన్
  • అవకాశాలు లేక బాధలు అనుభవించిన వైనం
కోలీవుడ్ సీనియర్ దర్శకుడు ఎం.త్యాగరాజన్ ఒక అనాథగా, ఎవరూ లేని వాడిగా రోడ్డు పక్కన ప్రాణాలు విడిచారు. రోడ్డు పక్కన మృతదేహాన్ని చూస్తున్నవారు ఎవరో పాపం అనుకుంటూ ఉన్న సమయంలో కొందరు ఆయనను గుర్తుపట్టారు. లేకపోతే ఆయనను చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ వారు ఒక అనాథ శవంగా ఖననం చేసేవారు.

త్యాగరాజన్ గతంలో ప్రముఖ నటులు కెప్టెన్ విజయకాంత్, ప్రభు తదితరులు నటించిన చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయకాంత్ హీరోగా 'మనగర కావల్', ప్రభు హీరోగా 'వెట్రి మేల్ వెట్రి' చిత్రాలకు దర్శకత్వం వహించారు.
 
ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందిన తర్వాత ఈయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అయితే, రెండు, మూడు చిత్రాలు చేసిన తర్వాత ఈయనకు అవకాశాలు రాలేదు. దీంతో మళ్లీ సొంతూరుకి వెళ్లారు. ఆ సమయంలో ఒక ప్రమాదానకి గురై కోమాలోకి వెళ్లి, మళ్లీ కోలుకున్నారు. చెన్నైకి వచ్చి సినీ అవకాశాల కోసం ప్రయత్నించినప్పటికీ ఆయనకు ఫలితం దక్కలేదు.

ఈ క్రమంలో ఏవీఎం స్టూడియో సమీపంలో రోడ్డు పక్కన ఆయన ఉండేవారు. 'అమ్మా క్యాంటీన్'లో తింటూ గడిపేవారని చెపుతున్నారు. ఇటీవలి కాలంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అనారోగ్యం నుంచి కోలుకున్న ఆయన మళ్లీ తాను ఉండే ప్రాంతానికి వెళ్లారు. చివరకు ఒక అనాథలా ఆయన కన్నుమూయడం కోలీవుడ్ లో అందరినీ కలచివేస్తోంది.


More Telugu News